Devaragattu Festival: నెత్తురోడిన దేవరగట్టు
ABN , Publish Date - Oct 04 , 2025 | 03:15 AM
ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులోని దేవరగట్టు క్షేత్రం నెత్తురోడింది. ఉత్సవమూర్తులు మాళ మల్లేశ్వరస్వాముల పల్లకిని వశం చేసుకోవడం కోసం సాగిన బన్ని ఉత్సవం కర్రల..
కర్రల సమరంగా మారిన బన్ని జైత్రయాత్ర ఉత్సవం
అరికెరకు చెందిన ఒకరు మృతి.. 94 మందికి గాయాలు
కర్నూలు/ ఆలూరు, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులోని దేవరగట్టు క్షేత్రం నెత్తురోడింది. ఉత్సవమూర్తులు మాళ మల్లేశ్వరస్వాముల పల్లకిని వశం చేసుకోవడం కోసం సాగిన బన్ని ఉత్సవం కర్రల సమరాన్ని తలపించింది. ఇరువర్గాలకు చెందిన గ్రామాల భక్తులు ఒకరిపై ఒకరు నిప్పు కాగడాలు, రాళ్లు రువ్వుకున్నారు. అరగంటకుపైగా సాగిన ఈ ఘర్షణలో ఓ భక్తుడు మృతి చెందగా 94 మంది తలలు పగిలి రక్తం చిందింది. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో దసరా పర్వదినాన బన్ని జైత్రయాత్ర ఉత్సవాలు ఏటా భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీ. తొలుత నెరణికి, నెరణికితండ, కొత్తపేట గ్రామాలకు చెందిన వేలాది మంది భక్తులు దేవరగట్టు కొండపైకి చేరుకున్నారు. ప్రధాన అర్చకులు గిరి మల్లయ్యస్వామి ఆధ్వర్యంలో మాళ మల్లేశ్వరుల కల్యాణోత్సవం నిర్వహించారు. ఉత్సవమూర్తుల పల్లకితో కొండ దిగి బసవన్నగుడి సమీపానికి చేరుకోబోతుండగా.. తమ గ్రామానికి ఆ పల్లకిని చేర్చాలనే పట్టుదలతో అరికెర గ్రామస్థులు అడ్డుకున్నారు. వారికి ఎల్లార్తి, అరికెరతండా, సులవాయి, ఆలూరు వాసులు తరలివచ్చారు. క్షణాల్లో రాళ్ల వర్షం కురిసింది. భగభగ మండే అగ్గికాగడాలను ఒకరిపై ఒకరు విసురుకున్నారు. వేలాది కర్రలు తలలపై నాట్యమాడాయి. ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు బలగాలను పంపించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఆ తరువాత యథాప్రకారం స్వామివారి పల్లకితో ముళ్లబండ, పాదాలగట్టు, రక్షబండ, శమీ వృక్షం వద్ద పూజలు చేసి ఉదయం 6:30 గంటలకు బసవన్న గుడికి చేరుకున్నారు. ప్రధాన అర్చకులు గిరి మల్లయ్యస్వామి భవిష్యవాణి(కార్ణీకం) వినిపించారు. అనంతరం ఉత్సవ మూర్తులను సింహాసనం కట్టకు చేర్చి మహామంగళహారతి ఇవ్వడంతో బన్ని జైత్రయాత్ర ఉత్సవం ముగిసింది. దేవుడి పల్లకి కోసం సాగిన ఘర్షణలో అరికెర గ్రామానికి చెందిన కోసిగి తిమ్మప్ప(50) అనే భక్తుడు తలకు బలమైన గాయాలు కావడంతో ఆలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. 94 మంది తలలు పగిలి రక్తగాయాలయ్యాయి. కాగా, ఉత్సవాలను చూసేందుకు వచ్చిన ఆదోని పట్టణం అరుణజ్యోతి నగర్‌కు చెందిన ఆంజనేయులు(47) గుండెపోటుకు గురై మృతిచెందారు.