Share News

CM Revanth Reddy: రాయదుర్గంలో డ్యుయిష్‌ బోర్స్‌ జీసీసీ

ABN , Publish Date - Nov 05 , 2025 | 04:23 AM

డ్యుయిష్‌ బోర్స్‌ కంపెనీ విస్తరణలో భాగంగా రాయదుర్గంలో గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్‌ (జీసీసీ)ను మంగళవారం ప్రారంభించింది....

CM Revanth Reddy: రాయదుర్గంలో డ్యుయిష్‌ బోర్స్‌ జీసీసీ

  • వచ్చే రెండేళ్లలో వెయ్యి మందికి ఉద్యోగాలు

  • జర్మనీ కాన్సుల్‌ జనరల్‌ బృందం

  • మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌ విజ్ఞప్తి

  • ఫిన్‌టెక్‌ గ్లోబల్‌ కమాండ్‌ సెంటర్‌గా హైదరాబాద్‌: మంత్రి శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): డ్యుయిష్‌ బోర్స్‌ కంపెనీ విస్తరణలో భాగంగా రాయదుర్గంలో గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్‌ (జీసీసీ)ను మంగళవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా జర్మనీ కాన్సుల్‌ జనరల్‌ మైకేల్‌ హాస్పర్‌, కంపెనీ ప్రతినిధులతో కూడిన బృందం సీఎం రేవంత్‌ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసింది. డ్యుయిష్‌ బోర్స్‌ జీసీసీతో వచ్చే రెండేళ్లలో వెయ్యి మందికి ఉద్యోగాలు దక్కుతాయని జర్మనీ బృందం సీఎంకు వివరించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జీసీసీ కోసం హైదరాబాద్‌ను ఎంచుకున్న జర్మనీ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని, అందుకు ప్రజాప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలిచి అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లో ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. తెలంగాణ విద్యార్థులకు జర్మన్‌ భాష నేర్పించాలని, ఇందుకోసం హైదరాబాద్‌లో జర్మనీ టీచర్లను నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్‌ రంగాల్లో జర్మనీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని కోరారు. కార్యక్రమంలో డ్యుయిష్‌ బోర్స్‌ సీఐవో/సీవోవో డాక్టర్‌ క్రిస్టోఫ్‌ బోమ్‌, అమితదేశాయ్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, హైదరాబాద్‌ ఫైనాన్షియల్‌ టెక్నాలజీ(ఫిన్‌టెక్‌)కి గ్లోబల్‌ కమాండ్‌ సెంటర్‌గా అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. రాయదుర్గంలో డ్యుయిష్‌ బోర్స్‌ జీసీసీని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్తంభంలా ఉన్న డ్యుయిష్‌ బోర్స్‌ హైదరాబాద్‌ను ఎంచుకోవడం అంతర్జాతీయ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలోని నైపుణ్యం కలిగిన మానవ వనరులపై ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. హైదరాబాద్‌ను ఇంక్యుబేషన్‌ హబ్‌గా మాత్రమే కాకుండా ‘‘గ్లోబల్‌ ఆవిష్కరణ పవర్‌హౌ్‌స’’గా మార్చేందుకు ప్రత్యేక గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ను ప్రారంభిస్తామని వెల్లడించారు. మరోపక్క, కృత్రిమ మేధకు సంబంధించిన ఆవిష్కరణల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా తెలంగాణ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ను ఏర్పాటు చేశామని మంత్రి శ్రీధర్‌బాబు మంగళవారం ప్రకటించారు. 2035 నాటికి ప్రపంచంలోని 20 అతి పెద్ద ఏఐ హబ్‌లలో తెలంగాణకు స్థానం కల్పించడమే ఈ హబ్‌ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.


సీఎంతో అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ ప్రతినిధుల భేటీ

అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ ప్రతినిఽధుల బృందం మంగళవారం సీఎం రేవంత్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయింది. తెలంగాణలో అమెజాన్‌ డేటా సెంటర్‌ పనులు, విస్తరణకు సంబంధించిన అంశాలను వారు ప్రస్తావంచగా.. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయం ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. సమావేశంలో అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ డేటా సెంటర్‌ గ్లోబల్‌ హెడ్‌ కెర్రీ పర్సన్‌, ఇన్ర్ఫా పబ్లిక్‌ పాలసీ డైరెక్టర్‌ విక్రమ్‌ శ్రీధరన్‌, అనురాగ్‌ కిల్నాని పాల్గొన్నారు.

క్యూబా రాయబారితో మంత్రి శ్రీధర్‌ బాబు భేటీ

ద్వ్వైపాక్షిక సహకారం ద్వారా నైపుణ్యాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకొని ఉమ్మడి పురోగతి వైపు అడుగులు వేద్దామంటూ క్యూబాకు మంత్రి శ్రీధర్‌ బాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు సచివాలయంలో మంగళవారం తనను కలిసిన క్యూబా రాయబారి జువాన్‌ కార్లోస్‌ మార్సన్‌ అగులేరా, ఫస్ట్‌ సెక్రటరీ మిక్కీ డియాజ్‌ పెరెజ్‌తో ఆయన మాట్లాడారు. తెలంగాణ-క్యూబా మధ్య సత్సంబంధాలను పెంపొందించేందుకు తమ ప్రభుత్వం సిద్థంగా ఉందని వారికి చెప్పారు. తెలంగాణతో కలిసి పని చేేసందుకు ఆసక్తిగా ఉన్నామని క్యూబా రాయబారి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Updated Date - Nov 05 , 2025 | 04:23 AM