Destitute Father Performs Last Rites: చేతిలో చిల్లిగవ్వలేక.. ఒడిలో కొడుకు మృతదేహంతో..
ABN , Publish Date - Nov 20 , 2025 | 05:35 AM
పేగు తెంచుకొని పుట్టిన కుమారుడినే భారం అనుకుందా తల్లి. దివ్యాంగుడైన ఆ బాలుడు.. ఏ దిక్కూలేక, ఆదరణ కరువై.. పట్టెడన్నం దొరక్క..
శ్మశాన వాటికలో దిక్కుతోచని స్థితిలో ఓ నిరుపేద తండ్రి
తన కుమారుడు చనిపోయాడని తెలిసినా రాని కన్నతల్లి
అంత్యక్రియలకు సాయం చేసిన స్థానికులు, స్వచ్ఛంద సంస్థ
పాలమూరులో విషాదం..
మహబూబ్‌నగర్, డిసెంబరు19 (ఆంధ్రజ్యోతి): పేగు తెంచుకొని పుట్టిన కుమారుడినే భారం అనుకుందా తల్లి. దివ్యాంగుడైన ఆ బాలుడు.. ఏ దిక్కూలేక, ఆదరణ కరువై.. పట్టెడన్నం దొరక్క.. ఆకలికి తాళలేక శుష్కించి చివరికి ప్రాణాలొదిలితే.. విషయం తెలిసి బిడ్డ మృతదేహాన్ని చూసేందుకు కూడా రాలేదా తల్లి! ఈ అమానవీయ ఘటన నారయణపేట జిల్లాలో వెలుగుచూసింది. మృతుడు జిల్లాలోని కోటకొండకు చెందిన బాలరాజు, శశికళ దంపతుల 14 ఏళ్ల బిడ్డడైన హరీశ్. పుట్టుకతోనే శారీరక, మానసిక వైకల్యంతో హరీశ్ బాధపడుతున్నాడు. కొన్నేళ్ల క్రితం బాలరాజు దంపతులు మహబూబ్‌నగర్‌కు వచ్చి ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. కొన్నాళ్లకు ఈ దంపతులకు మరో కుమారుడు కలిగాడు. పెద్ద కుమారుడైన హరీశ్‌కు దివ్యాంగుల కోటాలో పింఛను కోసం పాలమూరులో దరఖాస్తు చేసుకున్నా ఆ ప్రయత్నాలేవో సొంతూర్లోనే చేసుకోవాలని అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడారు. ఈ క్రమంలో కటిక పేదరికానికి తోడు కుమారుడు హరీశ్ వైకల్యం కారణంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. భార్యను స్థిమితపరిచేందుకు బాలరాజు.. ఆర్నెల్ల క్రితం కోటకొండలో ఉన్న 10 గుంటలను అమ్మి.. వచ్చిన రూ.8లక్షలతో ఆమె కోసం నగలు కొన్నాడు. అయినా భర్తతో గొడవపడుతూనే ఉన్న శశికళ కొన్నిరోజుల క్రితం భర్తను, దివ్యాంగుడైన హరీశ్‌ను వదిలేసి చిన్న కొడుకును చంకనెత్తుకొని ఇంట్లోంచి వెళ్లిపోయింది. భార్య తనను వదిలివెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోయిన బాలరాజు మద్యానికి బానిసైపోయాడు. హరీశ్ కోసం పింఛను ప్రయత్నాలనూ మానుకొని.. తనకు ప్రతినెలా వచ్చే కాస్త వేతన డబ్బులను కూడా తాగుడుకు తగలేసేవాడు. దీంతో పూట గడవడం కూడా కష్టమైపోయింది. హరీశ్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఈనెల 17న హరీశ్ మృతిచెందాడు. అంత్యక్రియల కోసం చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో స్మశాన వాటికలో బిడ్డ మృతదేహాన్ని ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ కూర్చిండిపోయాడు. హరీశ్ మృతిపై తల్లి శశికళకు సమాచారమిచ్చినా భర్తతో గానీ, ఆ బిడ్డతో గానీ తనకు సంబంధం లేదని ఆమె స్పష్టం చేసినట్లు తెలిసింది. అయినా కడుపున పుట్టిన కుమారుడిని కడసారి చూసేందుకైనా భార్య వస్తుందనే నమ్మకంతో బాలరాజు ఆ రోజు సాయంత్రం దాకా ఎదురుచూశాడు. స్థానికులు, వీఆర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఆయనకు నచ్చజెప్పి.. కొంత ఆర్థికసాయం చేసి అంత్యక్రియలకు ఒప్పించి.. ఆ కార్యక్రమాన్ని జరిపించారు.