Share News

KTR: సీఎం ప్రచారం చేసినా 44 శాతం దాటలేదు

ABN , Publish Date - Dec 13 , 2025 | 05:51 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటనల పేరిట పంచాయతీ ఎన్నికల కోసం ప్రచారం నిర్వహించినా తొలిదశ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కనీసం 44 శాతం సీట్లను దాటలేకపోయిందని..

KTR: సీఎం ప్రచారం చేసినా 44 శాతం దాటలేదు

  • ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకతకు తొలివిడత పంచాయతీ ఎన్నికలు నిదర్శనం

  • సర్పంచ్‌లుగా, మెంబర్లుగా గెలిచిన బీఆర్‌ఎస్‌ మద్దతుదార్లకు శుభాకాంక్షలు

  • అనేకచోట్ల 10, 20 ఓట్ల తేడాతోనే కాంగ్రెస్‌ బయటపడింది: కేటీఆర్‌

హైదరాబాద్‌, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటనల పేరిట పంచాయతీ ఎన్నికల కోసం ప్రచారం నిర్వహించినా తొలిదశ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కనీసం 44 శాతం సీట్లను దాటలేకపోయిందని, ఇది ప్రభుత్వంపై పెరిగిన ప్రజా వ్యతిరేకతకు నిదర్శనమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ ఎన్ని దౌర్జన్యాలు చేసినా బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు సర్పంచ్‌లుగా, వార్డు మెంబర్లుగా గెలిచారని చెబుతూ వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పంచాయతీ ఎన్నికలు అధికార పార్టీకి కొంత అనుకూలంగా ఉంటాయని తొలుత ప్రచారం జరిగినప్పటికీ రేవంత్‌ పాలనావైఫల్యంపై ప్రజలు పూర్తిగా విసిగిపోయారనే విషయం ఈ ఎన్నికల ఫలితాలతో రుజువైందన్నారు. చాలాచోట్ల 10, 20 ఓట్ల తేడాతోనే కాంగ్రెస్‌ మద్దతుదార్లు బయటపడ్డారని, ఫలితంగా ఆ పార్టీ కౌంట్‌డౌన్‌ మొదలైనట్లేనని అర్థమవుతోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయినప్పటికీ, పార్లమెంటు ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి దేశంలోనే మూడో అతిపెద్ద పార్టీగా సమాజ్‌వాదీ పార్టీని నిలబెట్టిన ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ తీరు తమకు స్ఫూర్తిదాయకమని కేటీఆర్‌ అన్నారు. అదే స్ఫూర్తితో బీఆర్‌ఎస్‌ కూడా బౌన్స్‌ బ్యాక్‌ అవుతుందని, మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు విచ్చేసిన అఖిలేశ్‌ యాదవ్‌కు కేటీఆర్‌ స్వాగతం పలికారు. తమ పార్టీ నేతలు అఖిలేశ్‌కు సాదరంగా స్వాగతం పలికి, ఆయనతో వివిధ అంశాల పైన చర్చించినట్లు కేటీఆర్‌ వెల్లడించారు. కాగా రాజకీయాల్లో జయాపజయాలు సహజమని, ఒక్కోసారి ప్రజలు నేతల పనితీరును, విధానాలను పునఃసమీక్షించుకునే అవకాశాన్ని ఓటమి ద్వారా కల్పిస్తారని అఖిలేశ్‌ అభిప్రాయపడ్డారు.

Updated Date - Dec 13 , 2025 | 05:51 AM