Share News

High Court: రూ.118 కోట్ల బకాయిలు ఉన్నా గీతంకు కరెంట్‌ కట్‌ చేయలేదేం?

ABN , Publish Date - Dec 17 , 2025 | 05:21 AM

విద్యుత్‌ బకాయిలు రూ.118 కోట్ల మేర ఉన్నా.. గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (గీతం) యూనివర్సిటీ కరెంటు కనెక్షన్‌ను ఎందుకు తొలగించలేదని హైకోర్టు న్యాయమూర్తి....

High Court:  రూ.118 కోట్ల బకాయిలు ఉన్నా గీతంకు కరెంట్‌ కట్‌ చేయలేదేం?

హైదరాబాద్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ బకాయిలు రూ.118 కోట్ల మేర ఉన్నా.. గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (గీతం) యూనివర్సిటీ కరెంటు కనెక్షన్‌ను ఎందుకు తొలగించలేదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నగేశ్‌ భీమపాక ప్రశ్నించారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు టీజీఎ్‌సపీడీసీఎల్‌ సంగారెడ్డి సర్కిల్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ (ఎస్‌ఈ) ప్రత్యక్షంగా హాజరుకావాలని ఆదేశించారు. తన చిన్నతనంలో రూ.800 బకాయి ఉన్నా తమ ఇంటి కరెంటు కనెక్షన్‌ను తొలగించారని ఈ సందర్భంగా న్యాయమూర్తి గుర్తుచేశారు. పెండింగ్‌ బకాయిలు చెల్లించాలంటూ విద్యుత్‌ పంపిణీ సంస్థ జారీచేసిన నోటీసులను సవాల్‌ చేస్తూ గీతం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌ నగేశ్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. యూనివర్సిటీ తరఫు న్యాయవాది వాదిస్తూ.. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఏకపక్షంగా నోటీసులు ఇచ్చిందని తెలిపారు. విద్యుత్‌ పంపిణీ సంస్థ తరఫు న్యాయవాది వాదిస్తూ.. గతంలో సైతం ఇదే తరహాలో పిటిషన్‌ దాఖలు చేసి ఉపసంహరించుకుందని, దాంతో అప్పటి నుంచి బిల్లుల బకాయిలు పెరుగుతూ 118 కోట్లకు చేరాయని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. విద్యుత్‌ అధికారులపై తీవ్రంగా మండిపడింది. చిన్నచిన్న ఇళ్లలో ఉంటే పేదవాళ్లు 118 రూపాయలు బకాయి ఉంటే విద్యుత్‌ అధికారులు చెలరేగిపోయి కరెంట్‌ కనెక్షన్‌ తొలగిస్తారని, 118 కోట్లు బకాయిగా ఉంటే ఎలాంటి స్పందన ఎందుకు లేదని ప్రశ్నించింది. వివరణ ఇచ్చేందుకు సంగారెడ్డి సర్కిల్‌ ఎస్‌ఈ హాజరుకావాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను 22కి వాయిదా వేసింది.

Updated Date - Dec 17 , 2025 | 05:21 AM