Share News

Kaleshwaram Barrage Renovation: కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు డిజైన్లివ్వండి

ABN , Publish Date - Oct 01 , 2025 | 03:06 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు అవసరమైన డిజైన్లు తయారు చేయడానికి వీలుగా అంతర్జాతీయ స్థాయి సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ......

Kaleshwaram Barrage Renovation: కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు డిజైన్లివ్వండి

ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ జాతీయస్థాయిలో నోటిఫికేషన్‌

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు అవసరమైన డిజైన్లు తయారు చేయడానికి వీలుగా అంతర్జాతీయ స్థాయి సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) కోరుతూ ప్రభుత్వం మంగళవారం జాతీయస్థాయిలో నోటిఫికేషన్‌ జారీ చేసింది. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ కోసం ఈవోఐ పిలవడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని ఈనెల 19న నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా ఉత్తర్వులు ఇచ్చిన విషయం విదితమే. ఆ తర్వాత రెండువారాల్లోగా డిజైన్‌ కన్సల్టెంట్‌ను ఎంపిక చేయాలని నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కూడా ఆదేశాలు ఇచ్చారు. డిజైన్లు సిద్ధం చేయాలంటే విధిగా జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) నివేదిక ప్రకారం బ్యారేజీల్లో వానాకాలానికి ముందు తర్వాత భూభౌతిక/భూసాంకేతిక పరీక్షలు చేయాల్సి ఉంటుంది. వానాకాలానికి ముందు అవసరమైన పరీక్షలన్నీ చేశారు. వరదల తర్వాత పరీక్షలు చేయాల్సి ఉంది. దాంతో డిసెంబరు/జనవరి దాకా మేడిగడ్డకు వరద ఉండే అవకాశం ఉంది. నవంబరులో సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు వరద తగ్గుముఖం పట్టనుంది. దాంతో ఈక్రమంలో టెక్నికల్‌ బిడ్లు తెరిచి.. ప్రాథమిక అర్హత పొందిన సంస్థలను కూడా పరీక్షల ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దాంతో టెక్నికల్‌ బిడ్‌, ఫైనాన్షియల్‌ బిడ్‌ ప్రక్రియలు పూర్తయ్యేలోపు మూడు బ్యారేజీల్లో పరీక్షలు పూర్తవుతాయని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది.

Updated Date - Oct 01 , 2025 | 03:06 AM