Deputy CM Urges Priority Proposals: ప్రాధాన్య క్రమంలో పనుల ప్రతిపాదనలు పంపండి
ABN , Publish Date - Sep 20 , 2025 | 05:17 AM
వివిధ ప్రభుత్వ శాఖల్లోని అభివృద్ధి పనులకు సంబంధించి ప్రాధాన్య క్రమంలో ప్రతిపాదనలు పంపాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క...
హ్యామ్ రోడ్ల టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలి
క్యాబినెట్ సబ్‌కమిటీ సమావేశంలో..అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి సూచనలు
హైదరాబాద్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : వివిధ ప్రభుత్వ శాఖల్లోని అభివృద్ధి పనులకు సంబంధించి ప్రాధాన్య క్రమంలో ప్రతిపాదనలు పంపాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మౌలిక సదుపాయాలు, ప్రధాన పనుల(క్యాపిటల్ వర్క్స్) క్యాబినెట్ సబ్‌కమిటీ సమావేశం శుక్రవారం సచివాలయంలో జరిగింది. కమిటీలో సభ్యులైన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అత్యవసరమైన ప్రధాన పనులకు ప్రాముఖ్యమివ్వాలని చెప్పారు. గతంలో ఒక్క శాతం నిధులకు 16 రెట్ల విలువైన పనులను ప్రతిపాదించేవారని, దాంతో నిధులు సరిపోక పనులు చేపట్టలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇప్పుడలా కాకుండా ఒక్క శాతం నిధులకు మూడు రెట్ల విలువైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. ప్రతిపాదనలను ఆమోదించే సందర్భంలో ఈ మూడు రెట్ల విలువైన ప్రతిపాదనలను మరింత కుదించడం జరుగుతుందని చెప్పారు. ఈ ప్రతిపాదనలను కూడా ఆయా శాఖల అధికారులు ప్రాధాన్య క్రమంలో హేతుబద్ధీకరించాలన్నారు. అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు వారంలోగా పూర్తిస్థాయి ప్రతిపాదనలతో సమావేశానికి రావాలని ఆదేశించారు. హ్యామ్(హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) రోడ్ల పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులను ఆదేశించారు.