Share News

Deputy CM Bhatti Vikramarka: సింగరేణిని బతికించుకోవడం తక్షణావసరం

ABN , Publish Date - Sep 13 , 2025 | 05:11 AM

భావితరాల కోసం సింగరేణిని బతికించుకోవడం తక్షణ అవసరమని, ఈ సంస్థను పదికాలాల పాటు కాపాడుకునేందుకు ఏం చేయాలో ఆలోచించి...

Deputy CM Bhatti Vikramarka: సింగరేణిని బతికించుకోవడం తక్షణావసరం

  • సంస్థను కాపాడుకునే మార్గం కనుక్కోవాలి.. మీ సూచనల అమలుకు ప్రభుత్వం సిద్ధం

  • కార్మిక సంఘాలతో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): భావితరాల కోసం సింగరేణిని బతికించుకోవడం తక్షణ అవసరమని, ఈ సంస్థను పదికాలాల పాటు కాపాడుకునేందుకు ఏం చేయాలో ఆలోచించి మార్గం కనుక్కోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కార్మిక సంఘాలను కోరారు. సింగరేణి కార్మిక సంఘాలతో భట్టి సమావేశమయ్యారు. సింగరేణిలో పనిచేేస వారు సంస్థ గురించి విధానపరమైన నిర్ణయాలు తీసుకోకపోతే నష్టం జరుగుతుందన్నారు. మారిన ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో ఎక్కడ తక్కువ ధరకు బొగ్గు లభిస్తే అక్కడ కొనుక్కునే అవకాశం ఏర్పడిందని, ఈ నేపథ్యంలో సింగరేణి ఉత్పత్తి చేసే బొగ్గు అమ్ముడుపోకపోతే అనర్థాలు జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అన్ని సంఘాలు సమావేశమై సింగరేణి భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. కార్మిక సంఘాల సూచనల అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయ్‌.. పోతుంటాయ్‌.. సంస్థను బతికించుకునేందుకున్న అన్ని మార్గాలను అన్వేషించాలని సూచించారు. కార్మిక సంఘాలు అవగాహనలేకుండా మాట్లాడితే సంస్థకు నష్టం జరుగుతుందని సూచించారు. ఏం చేయాలనే దానిపై సింగరేణి అధికారులు.. కార్మికులకు వివరించాలన్నారు. దీనికోసం సగం రోజు సెలవు ఇచ్చి మరీ సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో కనీస వేతనాల సలహా మండలి చైౖర్మన్‌ జనక్‌ ప్రసాద్‌, కార్మిక సంఘం నాయకులు ధర్మపురి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

‘కాంట్రాక్ట్‌’ వేతనాలు పెంచాలి : జేఏసీ

సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికుల వేతనాలను పెంచడంతోపాటు లాభాల వాటా కింద రూ.20 వేలు అందించాలని సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మికుల జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈమేరకు భట్టి, ప్రణాళిక సంఘం ఉప చైర్మన్‌ చిన్నారెడ్డిలను జేఏసీ తరపున మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, గుమ్మడి నరసయ్య కలిసి వినతిపత్రమిచ్చారు, కాగా, కాంట్రాక్ట్‌ కార్మికుల వేతనాల సమస్యపై కార్మిక శాఖ మంత్రి జి.వివేక్‌ను ఎమ్మెల్సీ కోదండరామ్‌తో కలిసి జే ఏసీ ప్రతినిధులు వినతిపత్రం అందించారు. ఈ నేపథ్యంలో వేతనాల పెంపుపై త్వరలోనే జీవో జారీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు జే ఏసీ ప్రతినిధులు తెలిపారు.

యాజమాన్యానిది మొండివైఖరి

సింగరేణి యాజమాన్యం మొండివైఖరి, సమస్యల పరిష్కారంలో కాలయాపన కారణంగా స్ట్రక్చర్‌ సమావేశాన్ని బహిష్కరించినట్టు సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌(సింగరేణి గుర్తింపు సంఘం-ఏఐటీయూసీ) ప్రకటించింది. గతేడాది కాలంలో సింగరేణి సీఎండీతోపాటు డైరెక్టర్‌(పా)తో జరిగిన సమావేశంలో ఒప్పుకున్న అంశాలపైనా సర్క్యులర్‌ జారీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని యూనియన్‌ అధ్యక్షుడు వి.సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కె.రాజ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Updated Date - Sep 13 , 2025 | 05:11 AM