Share News

Deputy CM Bhatti Vikramarka: హైదరాబాద్‌లో వరల్డ్‌ క్లాస్‌ ఫిలిం సిటీ ఏర్పాటు

ABN , Publish Date - Nov 06 , 2025 | 02:19 AM

హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫిలిం సిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో తమ ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు...

Deputy CM Bhatti Vikramarka: హైదరాబాద్‌లో వరల్డ్‌ క్లాస్‌ ఫిలిం సిటీ ఏర్పాటు

  • కాంగ్రెస్‌ హయాంలోనే సినీ రంగానికి మేలు

  • సినిమా స్టూడియోలకు స్థలాలిచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వాలే

  • సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి సర్కారు సిద్ధం

  • సినీ రంగ ప్రముఖులు, సినీ కార్మిక సంఘాల నేతల భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫిలిం సిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో తమ ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి బుధవారం జూబ్లీహిల్స్‌లోని తెలుగు క్లబ్‌లో సినీ రంగ ప్రముఖులు, సినీ రంగ కార్మిక నేతలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చాలా మంది సినీ పరిశ్రమ గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు గానీ.. ఉమ్మడి రాష్ట్రంలో గానీ, తెలంగాణలో కానీ సినీ పరిశ్రమకు కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలోనే మేలు జరిగిందన్నారు. వేలాది మంది సినీ కార్మికుల జీవితాలను మెరుగు పర్చడానికి, చెన్నై నుంచి సినీ పరిశ్రమను తరలించినప్పుడు హైదరాబాద్‌లో సినీ స్టూడియోల నిర్మాణానికి కాంగ్రెస్‌ ప్రభుత్వమే భూములు ఇచ్చిందని గుర్తు చేశారు. అన్నపూర్ణ, పద్మాలయ, రామానాయుడు తదితర సినిమా స్టూడియోలు కాంగ్రెస్‌ ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే ప్రారంభమయ్యాయన్నారు. ఫిలిం క్లబ్‌కు సైతం కాంగ్రెస్‌ ప్రభుత్వమే స్థలం కేటాయించిందని భట్టి చెప్పారు. సీనియర్‌ నటుడు ప్రభాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో సినీ కార్మికుల కోసం దివంగత సీఎం వైఎస్‌ను అడిగి మరీ చిత్రపురి కాలనీని ఏర్పాటు చేయించారని పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు ఏ సమస్య వచ్చినా.., ఎటువంటి విజ్ఞప్తులు వచ్చినా పరిష్కారానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అన్ని భాషల వారిని అక్కున చేర్చుకునే గొప్ప నగరం హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం, చక్కటి వాతావరణంతోపాటు తక్కువ ధరకే మానవ వనరులు లభిస్తాయని భట్టి పేర్కొన్నారు. ప్రతి సందర్భంలోనూ సినీ పరిశ్రమకు కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అండగా నిలబడ్డాయని, భవిష్యత్తులోనూ నిలబడతాయని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ ఎంత బాగా ఎదిగితే అంత మందికి ఉపాధి లభిస్తుందని, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం బలంగా ఉంటేనే సినీ పరిశ్రమ బాగా ఎదుగుతుందన్న భట్టి.. సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రతి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తామన్నారు. ఎఫ్‌డీసీ చైర్మన్‌తో మాట్లాడి ‘మా’ అసోసియేషన్‌ కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయించి.. సినీ నటుల కల సాకారమయ్యేందుకు యత్నిస్తామన్నారు. భవిష్యత్తులో మంచి సినిమాలు రావాలి, చిన్న సినిమాలు కూడా రావాలని భట్టి విక్రమార్క చెప్పారు. ఈ సమావేశంలో ఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2025 | 02:19 AM