Deputy CM Bhatti Vikramarka: పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశారు
ABN , Publish Date - Dec 28 , 2025 | 07:25 AM
పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ నేతలు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, విచ్ఛిన్నం చేశారని, పాలనను గాడి తప్పించి నాశనం చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ధ్వజం
నేలకొండపల్లి, హైదరాబాద్, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ నేతలు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, విచ్ఛిన్నం చేశారని, పాలనను గాడి తప్పించి నాశనం చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కోనాయగూడెంలో రూ.2.20కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌ను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో భట్టి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రూ.8.50లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. పేదల సంక్షేమానికే కాంగ్రెస్ కట్టుబడి ఉందని, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించేది కాంగ్రెస్సేనన్నారు. ప్రతి వ్యక్తికి 6కేజీల చొప్పున సన్న బియ్యం ఇస్తూ 96లక్షల కుటుంబాలకు సంవత్సరానికి రూ.13,500కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు పథకం కింద ఇప్పటి వరకు ఆర్టీసీకి రూ.8600 కోట్లు ఇచ్చామన్నారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ ఒక్క ఇల్లు కట్టించలేదన్నారు.
సంస్కారం లేని కేటీఆర్: మైనంపల్లి
అమెరికాలో చదువుకున్న కేటీఆర్ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని హైదరాబాద్ గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు విమర్శించారు. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని దుష్ప్రచారం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. హజీజ్ నగర్ చెరువులో హరీష్ రావు అక్రమంగా కట్టుకున్న ఫామ్ హౌస్‌ను హైడ్రాతో కూల్చివేయించాలని మైనంపల్లి సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. బీఆర్‌ఎస్ నేతలు అసైన్మెంట్ భూములు అక్రమించి, అమ్మి దోచుకున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధికి శనిలా దాపురించిన కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిపై స్థాయికి మించి మాట్లాడుతున్నారని, కేటీఆర్ తీరు మారకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు తోలు తీస్తారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ హెచ్చరించారు. బీఆర్‌ఎస్ పదేళ్ల అవినీతి పాలన పైన, రెండేళ్ల ప్రజాపాలన పైన చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ నాయకుల భాషతో తెలంగాణ సమాజం తలదించుకుంటుందని చెప్పారు. మతి తప్పి మాట్లాడితే సిరిసిల్లలో చెప్పుల దండ వేసి చీపురుతో కొట్టే పరిస్థితి ఏర్పడుతుందన్నారు.