Share News

Deputy CM Bhatti Announces: బొగ్గు గనుల వేలంలో పాల్గొంటాం

ABN , Publish Date - Sep 13 , 2025 | 05:12 AM

దేశంలో బొగ్గు గనుల వేలం ఎక్కడ జరిగినా పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. బొగ్గు గనులే...

Deputy CM Bhatti Announces: బొగ్గు గనుల వేలంలో పాల్గొంటాం

  • దేశంలో ఇతర ఖనిజాల వేలం పాటలో కూడా..

  • సింగరేణికి ప్రభుత్వం పచ్చజెండా

  • 2 గనులు కోల్పోవడంతో రూ.60 వేల కోట్ల నష్టం: భట్టి

హైదరాబాద్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): దేశంలో బొగ్గు గనుల వేలం ఎక్కడ జరిగినా పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. బొగ్గు గనులే కాకుండా ఇతర మినరల్స్‌ వేలంలో కూడా పాల్గొంటామని చెప్పారు. సింగరేణిని ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో వేలం పాట ఆవశ్యతకపై భట్టి పపర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కొద్ది మంది భావోద్వేగాలు సృష్టించి, వేలం పాటలో పాల్గొనకుండా సింగరేణిని, రాష్ట్రాన్ని నాశనం చేసే కుట్రలు చాలా కాలం పాటు చేశారని ఆక్షేపించారు. వేలంపాటలో పాల్గొనకపోవడం వల్ల సింగరేణి రెండు పెద్దబ్లాకులతో పాటు వాటి ద్వారా వచ్చే రూ.60 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందన్నారు. వేలంపాటలో పాల్గొనకపోతే ప్రైవేట్‌ సంస్థలకే మేలు జరుగుతోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తబ్లాకులు దక్కించుకోకపోతే 31 మిలియన్‌ టన్నులకు ఉత్పత్తి పడిపోతుందని, బొగ్గుబావులు మూతపడితే.. శాశ్వత ఉద్యోగులు 40వేల మంది, తాత్కాలిక ఉద్యోగులు 30వేల మంది రోడ్డున పడతారని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుతో దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు బొగ్గు బ్లాకులు దక్కించుకోవాలంటే విధిగా వేలం ద్వారానే పాల్గొనాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. సత్తుపల్లి, కోయగూడెం బ్లాకులు ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయని, దీనివల్ల సింగరేణి 60 వేల కోట్లు, 15 వేల కోట్ల లాభాలను కోల్పోయిందన్నారు. దేశంలో ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు వేలంలో పాల్గొని... గనులు దక్కించుకుంటున్నప్పుడు సింగరేణి పాల్గొంటే తప్పేమిటని ప్రశ్నించారు. ప్రస్తుతం 38 గనుల్లో సింగరేణి బొగ్గు తవ్వకాలు చేపడుతోందని, రానున్న ఐదేళ్లలో 10 గనులు మూతపడనున్నాయన్నారు. ప్రస్తుతం ఏటా 72 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నామని, కొత్త బ్లాకులు రానట్లయితే ఉత్పత్తి సగానికి పడనుందన్నారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 200 ఖనిజ బ్లాకులను వేలం వేయాలని ప్రణాళికను రూపొందించినట్లు గనులు, భూగర్భ వనరుల శాఖ తెలిపింది. సున్నపు రాయి, లేటరైట్‌, మాంగనీస్‌, క్వార్ట్జ్‌, గ్రానైట్‌, కలర్‌ గ్రానైట్‌, డోలమైట్‌, రోడ్డు మెటల్‌ తదితర 200 ఖనిజ బ్లాకులను వేలం వేయాలని నిర్ణయించినట్లు భట్టికి సమర్పించిన ఆదాయం, ప్రణాళికపై నివేదికలో పేర్కొంది. వాటిలో సున్నపురాయి,మాంగనీస్‌, బేస్‌ మెటల్‌కు సంబంధించిన 32 భారీ ఖనిజ బ్లాకులు ఉన్నాయి.

Updated Date - Sep 13 , 2025 | 05:12 AM