Deputy CM Batti Vikramarka: తుఫాను సహాయక చర్యలకు విపత్తు నిధిని వాడుకోండి
ABN , Publish Date - Oct 31 , 2025 | 03:04 AM
మొంథా తుఫాను నేపథ్యంలో సహాయ, పునరావాస చర్యల కోసం రాష్ట్ర విపత్తుల సహాయ నిధి(ఎ్‌సడీఆర్‌ఎ్‌ఫ)ని వాడుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జిల్లా...
నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదు: భట్టి విక్రమార్క
హైదరాబాద్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాను నేపథ్యంలో సహాయ, పునరావాస చర్యల కోసం రాష్ట్ర విపత్తుల సహాయ నిధి(ఎ్‌సడీఆర్‌ఎ్‌ఫ)ని వాడుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తుఫాను పరిస్థితులపై గురువారం ఆయన ప్రజాభవన్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుత అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ఎస్‌డీఆర్‌ఎ్‌ఫను ముందుగా వినియోగించుకుని, ఆ తర్వాత 30 రోజుల్లో నిధులకు ఆమోదం తీసుకోవచ్చని సూచించారు. నిధులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రివర్గం 48 గంటలు ముందుగానే రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేయడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించగలిగామన్నారు. తుఫాను మాన్యువల్ ప్రకారం.. సహాయ, పునరావాస చర్యలు చేపట్టాలన్నారు. పత్తి తడవకుండా టార్పాలిన్లు కప్పడం, గోదాముల్లోకి పత్తిని తరలించడం వంటి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తుఫాను కారణంగా ఎక్కడా విద్యుత్తు సమస్య తలెత్తకుండా మొబైల్ వ్యాన్ల ద్వారా విద్యుత్తు సిబ్బంది రకరకాల సేవలు అందించారని ప్రశంసించారు. తుఫాను వల్ల 33/11 కె.వి. సబ్ స్టేషన్లు 11 దెబ్బతినగా.. వాటిలో ఏడింటిని పునరుద్ధరించడం జరిగిందని, మిగతా నాలుగింటిని త్వరలో పునరుద్ధరిస్తారన్నారు. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు 171 దెబ్బతినగా.. 49 ప్రాంతాల్లో పునరుద్ధరించారని, మరో 122 ట్రాన్స్‌ఫార్మర్ల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయన్నారు.
రోడ్లకు రూ.225 కోట్ల నష్టం: మంత్రి కోమటిరెడ్డి
‘మొంథా’ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో రోడ్లు-భవనాల శాఖ పరిధిలోని రోడ్లకు రూ.225 కోట్ల మేర నష్టం వాటిల్లింది. వరద ప్రవాహంతో 201 చోట్ల రోడ్లపై నుంచి నీరు ప్రవహించింది. మొత్తం 334 ప్రాంతాల్లో 23.041 కి.మీ మేర రోడ్లు దెబ్బతిన్నట్టు ఆర్ అండ్ బీ అధికారులు గుర్తించారు. 8 చోట్ల రోడ్లు కోతకు గురవ్వగా 156 చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. వీటిలో కొన్నింటిని పరిష్కరించి, ట్రాఫిక్‌ను మళ్లించారు. ఈ పనుల తాత్కాలిక మరమ్మతులకు రూ.6.96 కోట్లు, శాశ్వత పనులకు రూ.225.75 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించారు. కాగా రాష్ట్రంలో కురిసే వర్షాల పట్ల ఆర్ అండ్ బీ శాఖ అప్ర మత్తంగా ఉందని, సీఎం రేవంత్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే శాఖ ఈఎన్‌సీలు, సీఈలు అంతా క్షేత్రస్థాయిలో ఉన్నారని తెలిపారు. అకాల వర్షాలతో నష్టపోయిన నల్లగొండ జిల్లా రైతాంగంపై ప్రత్యేక దృష్టి సారించి ఆదుకోవాలని సీఎం రేవంత్‌ను విజ్ఞప్తి చేశారని మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్(న్యాక్) ఆధ్వర్యంలో పలు సంస్థల సహకారంతో ఉద్యోగ అవకాశాల కోసం నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. శిక్షణతో పాటు ఉచిత భోజనం, వసతి సదుపాయం కల్పిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. వివరాల కోసం 8008937800/ 9032504507 నంబర్లను సంప్రదించాలని న్యాక్ అధికారులు సూచించారు.