Remove GST on Handloom: చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని తొలగించాలి
ABN , Publish Date - Aug 19 , 2025 | 04:45 AM
తెలంగాణ హస్తకళల పరిశ్రమకు చేనేత రంగం ఊపిరిలాంటిదని, చేనేత ఉత్పత్తులపై కేంద్రం విధించిన 5 శాతం వస్తుసేవల పన్ను..
ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు తుమ్మల లేఖ
హైదరాబాద్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ హస్తకళల పరిశ్రమకు చేనేత రంగం ఊపిరిలాంటిదని, చేనేత ఉత్పత్తులపై కేంద్రం విధించిన 5 శాతం వస్తుసేవల పన్ను (జీఎస్టీ)తో ప్రస్తుతం ఈరంగం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోందని రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే చేనేత రంగం గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది కార్మికులకు జీవనాధారంగా ఉందన్నారు. చేనేత కార్మికుల ప్రయోజనాలను కాపాడటానికి, వారికి నిరంతరం ఉపాధి కల్పించడానికి చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీని మినహాయించేలా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఈమేరకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హస్తకళల, చేనేతశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌లకు మంత్రి తుమ్మల లేఖలు రాశారు. ముడి సరుకుల ధరలు పెరగడం, పవర్‌లూమ్, హ్యాండ్లూమ్ రంగాలు తక్కువ ఉత్పత్తి వ్యయంతో వస్ర్తాలు తయారు చేయడంతో మార్కెట్లో చేనేత వస్ర్తాలు తయారుచే సే నేత కార్మికులకు గిరాకీ తగ్గిపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తుమ్మల ఆవేదన వ్యక్తంచేశారు. దీనికి తోడు 5శాతం జీఎస్టీ విధించడంతో చేనేత ఉత్పత్తుల ధరలు పెరిగి వినియోగం తగ్గిపోతోందని, కార్మికుల జీవనాధారం సంక్షోభంలో పడుతోందన్నారు. ఖాదీ ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ మినహాయింపు ఉండగా.. చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ కొనసాగించడం అన్యాయమని మంత్రి పేర్కొన్నారు.