Minister Tummala Nageswara Rao: మద్దతు ధర పథకంలో 25% పరిమితిని రద్దు చేయండి
ABN , Publish Date - Oct 12 , 2025 | 03:40 AM
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని మద్దతు ధర పథకంలోకి కొన్ని పంటలను చేర్చడంతో పాటు, కొన్ని పంటలకు ఉన్న కొనుగోలు పరిమితులను తొలగించాలని...
జొన్న, మొక్కజొన్నలను మద్దతు ధర పథకంలో చేర్చండి
కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌కు తుమ్మల లేఖ
హైదరాబాద్, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ పరిధిలోని మద్దతు ధర పథకంలోకి కొన్ని పంటలను చేర్చడంతో పాటు, కొన్ని పంటలకు ఉన్న కొనుగోలు పరిమితులను తొలగించాలని కోరుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్‌కు లేఖ రాశారు. ‘మద్దతు ధర పథకం (ప్రైస్ సపోర్ట్ స్కీమ్) కింద కొనుగోలు చేస్తున్న నువ్వులు, వేరుశెనగ, శనగలు, సోయాబీన్, పెసర వంటి పంటలపై కేంద్రం 25 శాతం సీలింగ్ విధించింది. దీనివలన రైతులు పండించిన పంటల్లో కేవలం 25ు మాత్రమే మద్దతు ధరకు విక్రయించుకునే అవకాశం ఉంది. ఈ 25ు పరిమితిని రద్దు చేయడం లేదా సడలించాలి’ అని తుమ్మల కోరారు. రాష్ట్రంలో సాగయ్యే జొన్న, మొక్కజొన్న పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించినప్పటికీ కేంద్రం ద్వారా కొనుగోలు జరగకపోవడం వలన రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులతో కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. ఈ రెండు పంటలను మద్దతు ధర పథకం పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కనీస మద్దతు ధర అమలు, మార్కెట్ జోక్యాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యయభారం పంచుకునే విధంగా ఆర్థిక విధానం రూపుదిద్దాలని సూచించారు. ఇక దేశంలో ఆయిల్‌పామ్ పంటలో తెలంగాణ ముందంజలో ఉందని, దాదాపు 1.08 లక్ష హెక్టార్లలో 73,744 మంది రైతులు ఆయిల్‌పామ్ సాగుచేస్తున్నారని, 2025-26 ఏడాదిలో మరో 50వేల హెక్టార్లలో సాగు లక్ష్యంగా పెట్టుకున్నామన్నాని వివరించారు. అయితే కేంద్ర ప్రభుత్వం క్రూడ్ పామాయిల్‌పై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడంతో ధరలు తీవ్రంగా పడిపోయి, ఆయిల్‌పామ్ రైతులు పొందే తాజా ప్రూట్ బంచ్ ధర టన్నుకు రూ.20వేల కంటే తక్కువకు చేరుకుందని పేర్కొన్నారు. అలాగే పత్తి పంట విషయంలోనూ సీసీఐ కొనుగోళ్లు 50-60 శాతానికే పరిమితం అవుతున్నాయని, కొనుగోళ్లలో ఆలస్యంతో రైతులను కనీస మద్దతు ధర లభించడంలేదని తెలిపారు. పత్తి దిగుమతులపైనా సుంకం మినహాయింపు ఇవ్వడం వల్లనూ దేశీయంగా ధరలు మరింత పడిపోయాయయని పేరొన్నారు. ఆయిల్‌పామ్, పత్తి పంటలపై దిగుమతి సుంకం విధానాల్లో దేశీయ మార్కెట్ సీజన్‌లకు అనుగుణంగా ఉండేలా ఆర్థిక శాఖ సమన్వయం చేసుకుని, రైతులను మేలు జరిగేలా చూడాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే రైతుల రక్షణ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కాగా ‘‘పీఎం ధన్ ధాన్య కృషి యోజన’’, ‘‘నేషనల్ మిషన్ ఆన్ పల్సెస్’’ పథకాలను ప్రారంభించిన కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్‌కు లేఖ ద్వారా తుమ్మల అభినందనలు తెలిపారు.