Sriram Sagar Project: ఎస్సారెస్పీ రెండోదశ కాల్వకు భీమిరెడ్డి పేరు పెట్టాలి
ABN , Publish Date - Dec 11 , 2025 | 04:57 AM
శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) రెండో దశ కాల్వకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి...
రౌండ్ టేబుల్ సమావేశంలో మేధావుల డిమాండ్
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) రెండో దశ కాల్వకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి(బీఎన్) పేరు పెట్టాలని పలువురు మేధావులు, విద్యావేత్తలు, ప్రముఖ పాత్రికేయులు డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం సుదీర్ఘకాలం పోరాడి, ఆనాటి ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి మరీ విజయం సాధించిన బీఎన్ పేరు కాకుండా, దానికి మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి(ఆర్డీఆర్) పేరు ప్రకటించడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఎన్ ఆలోచనా వేదిక ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ వేదికగా ‘‘భీమిరెడ్డి నర్సింహారెడ్డి జ్ఞాపకాలు, ఎస్సారెస్పీ కాల్వ పేరు మార్పుపై సమాలోచనలు’’ అంశంపై సీనియర్ జర్నలిస్టు వర్ధెల్లి మురళి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఎస్సారెస్పీ రెండో దశ కాల్వకు, సూర్యాపేట జిల్లాకు బీఎన్ పేరు పెట్టాలని సభలో జూలూరు గౌరీశంకర్ తీర్మానాన్ని ప్రతిపాదించారు. కార్యక్రమానికి హాజరైన పాత్రికేయులు కె. రామచంద్రమూర్తి, కె. శ్రీనివాస్, అల్లం నారాయణ, టంకశాల అశోక్, కట్టా శేఖర్‌రెడ్డి, దిలీ్‌పరెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, సినీ దర్శకుడు ఎన్. శంకర్, విశ్రాంత ప్రొఫెసర్లు వినాయక్‌రెడ్డి, భగవంత్‌రెడ్డి తదితరులంతా తీర్మానానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆర్డీఆర్ ఎస్సారెస్పీ-స్టేజ్2గా నామకరణం చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెనక్కి తీసుకోవాలని వారంతా ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.