Demand to Change Triple R Road: ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్చాలి
ABN , Publish Date - Sep 17 , 2025 | 05:20 AM
రీజనల్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్చాలని యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చిమిర్యాల గ్రామంలో భూనిర్వాసితులు డిమాండ్ చేశారు...
యాదాద్రి భువనగిరి జిల్లాలో రాస్తారోకో
చౌటుప్పల్/నర్సాపూర్/తూప్రాన్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రీజనల్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్చాలని యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చిమిర్యాల గ్రామంలో భూనిర్వాసితులు డిమాండ్ చేశారు. ఈ మేరకు చౌటుప్పల్ ప్రధాన రహదారిపై మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కొంతమంది స్వార్థ ప్రయోజనాలకోసం అలైన్‌మెంట్ మార్చారని ఆరోపించారు. రహదారి నిర్మాణం పేరుతో తమ భూములను లాక్కొని జీవనోపాధి లేకుండా చేయొద్దని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా అలైన్‌మెంట్ మార్చాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. త్రిబుల్ ఆర్ రోడ్డు కోసం భూములిచ్చిన రైతులకు పరిహారం పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. మెదక్ జిల్లా నర్సాపూర్ డివిజన్‌లోని సుమారు 1,048 మంది రైతుల నుంచి 758 ఎకరాల భూమి సేకరించగా.. ఎకరాకు రూ. 13 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు పరిహారంగా ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. తూప్రాన్ డివిజన్ పరిధిలో ఎనిమిది గ్రామాల నుంచి 436.20 ఎకరాల భూమిని సేకరించారు. ఇక్కడ ఎకరాకు రూ.4.50 లక్షల నుంచి రూ. 6.75 లక్షల మేరకు పరిహారం ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆయా గ్రామాల్లో రైతులకు అప్రూవుడ్ అంటూ అధికారులు నోటీసులు అందజేస్తున్నారు.