Share News

Online Betting: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో ప్రాణం బలి

ABN , Publish Date - Dec 26 , 2025 | 06:03 AM

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ భూతం మరో ప్రాణాన్ని బలిగొంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొత్తకొత్త పేర్లతో అందుబాటులోకి వస్తున్న బెట్టింగ్‌ యాప్‌లు ప్రాణాలు తోడేస్తున్నాయి....

Online Betting: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో ప్రాణం బలి

  • రంగారెడ్డి జిల్లా దెబ్బడగూడలో డిగ్రీ విద్యార్థి బలవన్మరణం

  • బెట్టింగ్‌ విషయం తెలిసి మందలించిన తండ్రి

  • మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం, చికిత్స పొందుతూ మృతి

  • కుమారుడి నేత్రాలను దానం చేసిన తల్లిదండ్రులు

కందుకూరు, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ భూతం మరో ప్రాణాన్ని బలిగొంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొత్తకొత్త పేర్లతో అందుబాటులోకి వస్తున్న బెట్టింగ్‌ యాప్‌లు ప్రాణాలు తోడేస్తున్నాయి. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ విషయంలో తండ్రి మందలించడంతో ఆత్మహత్యకు యత్నించిన ఓ డిగ్రీ విద్యార్థి చికిత్స పొందుతూ గురువారం మరణించాడు. అనుకోని ఈ ఘటనతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన ఆ తల్లిదండ్రులు.. ఇంత కష్టంలోనూ తమ కుమారుడి కళ్లను దానం చేసి మరొకరి జీవితంలో వెలుగులు నింపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని దెబ్బడగూడ గ్రామానికి చెందిన వి.విక్రమ్‌(20) హైదరాబాద్‌లోని బీజేఆర్‌ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. కొంతకాలంగా ఫన్‌ ఇన్‌ ఎక్స్‌చేంజ్‌ అనే ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ను వినియోగిస్తున్న విక్రమ్‌.. ఇంట్లో వాళ్లకి తెలియకుండా మంగళవారం ఆ యాప్‌లో రూ.లక్ష పెట్టాడు. ఆ సొమ్ము మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. డబ్బు విషయం తెలియడంతో బుధవారం ఉదయం విక్రమ్‌ను తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన విక్రమ్‌ బుధవారం మధ్యాహ్నం వ్యవసాయ క్షేత్రంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసి కుటుంబసభ్యులు విక్రమ్‌ను వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామునమరణించాడు. కాగా, ప్రైవేటు ఆస్పత్రిలో విక్రమ్‌ మరణించగా అతడి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రి వైద్యుల సూచనల మేరకు విక్రమ్‌ రెండు కళ్లను తల్లిదండ్రులు దానం చేశారు.

Updated Date - Dec 26 , 2025 | 06:03 AM