డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా
ABN , Publish Date - Apr 11 , 2025 | 12:37 AM
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమా న్యాలు బహిష్కరణ అస్త్రం ప్రయోగిస్తున్నాయి.

బకాయిల కోసం పట్టువీడని యాజమాన్యాలు, లెక్చరర్లు
భువనగిరి టౌన్, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమా న్యాలు బహిష్కరణ అస్త్రం ప్రయోగిస్తున్నాయి. బకాయి వేతనాలు చెల్లిం చాలని లెక్చరర్లు నిరసనలకు దిగుతున్నారు. ఫలితంగా నేటినుంచి ప్రా రంభం కావల్సిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) వాయిదా వేసింది. దీంతో విద్యా సంవత్సరం ముగింపులో విద్యార్థుల మానసిక ఒత్తిడికి గురయ్యే పరిస్థితి నెలకొంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ కళాశాలలు ఆర్థిక ఊబిలోకి కూరుకుపోతున్నాయి. వివిధ రూపాల్లో నిరసన తెలిపినా ప్ర భుత్వం స్పందించకపోవడంతో పరీక్షలనే బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ ఇటీవల ప్రక టించింది. ఎంజీయూ పరిధిలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో నిర్వహించే ప్రాక్టికల్స్, థియరీ పరీక్షలను బహిష్కరిస్తున్నట్లు గత నెలలోనే యూనివర్సిటీకి లేఖ కూడా అందజేసింది. ఆరు నెలలుగా వేతనాలు రావడం లేదని లెక్చరర్లు కూడా పరీక్షలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎంజీయూ పరిధిలో ఈ నెల 2 నుంచి 9 వరకు రెండు దఫాలుగా జరిగిన ప్రాక్టికల్స్ పరీక్షలను ప్రైవేట్ యాజ మాన్యాలు, లెక్చరర్లు బహిష్కరించడంతో కేవలం ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్య గురుకుల, ఎయిడెడ్ కళాశాలల్లో మాత్రమే ప్రాక్టికల్స్ పరీక్షలు జరిగాయి. దీంతో ప్రైవేట్ విద్యార్థులు నష్టపోయారు. బకాయులపై ప్రభుత్వం స్పందించకపోవడం, ప్రైవేట్ యాజమాన్యాలు, లెక్చరర్స్ పట్టు వీడకపోవడంతో 11నుంచి ప్రారంభం కావల్సిన సప్లమెంటరీ, సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఎంజీయూ గురువారం సాయంత్రం ప్రకటించింది.
షెడ్యూల్ ప్రకారం..
షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 11 నుంచి మే 6 వరకు జరగాల్సిన 1, 3, 5వ సెమిస్టర్స్ సప్లిమెంటరీ, 2, 4, 6వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. దీంతో ఎంజీయూ పరిధిలోని సుమారు 86 ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల సుమారు 25వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయలేని పరిస్థితి. తమకు రావల్సిన సుమారు రూ.100 కోట్ల పైబడి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేస్తేనే పరీక్షల నిర్వహ ణకు సహకరిస్తామని సుమారు 66 ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమా న్యాలు, ఆరు నెలల బకాయి వేతనాలు సుమారు రూ. 25 కోట్ల పైబడి చెల్లిస్తేనే పరీక్షల విధులు నిర్వహిస్తామని ప్రైవేట్ లెక్చరర్స్ పేర్కొంటుం డటంతో ప్రభుత్వ నిర్ణయంపైనే పరీక్షల నిర్వహణ ఆధారపడి ఉందని యూనివర్సిటీ అధికారులు, కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. గత అక్టోబరులో చేపట్టిన సమ్మె విరమణ ఒప్పం దంలో ఇచ్చిన హామీలేవి ప్రభుత్వం నెరవేర్చలేదని, దీంతో హామీలు కాకుండా వాస్తవాల ఆధారంగానే సమ్మె విరమణ, పరీక్షల నిర్వహణ ఆధారపడి ఉంటుందని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సూర్య నారాయణరెడ్డి, ఉమ్మడి జిల్లా కోశాధికారి ప్రవీణ్‌కుమార్, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అసోసియేట్ అధ్యక్షుడు కోడిమాల కృష్ణ తెలిపారు.