Defeated Candidates Demand Money Back: ఓటేయలే.. పైసలు తిరిగిచ్చెయ్!
ABN , Publish Date - Dec 13 , 2025 | 05:30 AM
ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన కొందరు అభ్యర్థులు.. తాము పంచిన డబ్బులు తిరిగి వసూలు చేస్తున్నారు....
మహబూబాబాద్ రూరల్/వర్ధన్నపేట రూరల్/ధరూరు, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన కొందరు అభ్యర్థులు.. తాము పంచిన డబ్బులు తిరిగి వసూలు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా మానుకోట మండలం సోమ్లాతండాలో ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్ సోదరుడి భార్య భూక్యా కౌసల్య సర్పంచ్ పదవికి పోటీ చేసి ఓడిపోయారు. దీనితో ఆగ్రహించిన ఆమె కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలో తాము డబ్బులు పంచినవారి ఇళ్లకు వెళ్లి.. తనకే ఓటేసినట్టు ప్రమాణం చేయాలని, లేదా పంచిన డబ్బు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో గ్రామస్తులు వారితో వాగ్వాదానికి దిగారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని శాంతింపజేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బండౌతపురం సర్పంచ్ పదవికి నేరెళ్ల కుమారస్వామి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనకు 55 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఆయన 500 మందికి ఓటుకు రూ.వెయ్యి చొప్పున రూ.5 లక్షలు పంచారని, కానీ 55 ఓట్లు మాత్రమే రావడంతో విస్మయం చెందారని గ్రామస్తులు చెబుతున్నారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఇంటింటికీ వెళ్లి.. తాను పంచిన డబ్బులు తిరిగి వసూలు చేసుకున్నారని అంటున్నారు. మరోవైపు జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం కోతులగిద్దలో సర్పంచ్ పదవికి పోటీచేసిన కాంగ్రెస్ మద్దతుదారు రంగస్వామి 252 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దీనితో కొన్ని రైతు కుటుంబాలు తనకు ఓటేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం గ్రామం నుంచి 40 ఎకరాల పొలాలకు వెళ్లే బాటను తవ్వించి, మట్టి అడ్డంగా పోయించారు.