Family Tragedy: ఆర్థిక ఇబ్బందులతో దంపతుల బలవన్మరణం
ABN , Publish Date - Nov 22 , 2025 | 05:18 AM
అప్పుల బాధ తాళలేక కూరగాయలు విక్రయించే దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. చైతన్యపురి ఇన్‌స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.
దిల్‌సుఖ్‌నగర్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి) : అప్పుల బాధ తాళలేక కూరగాయలు విక్రయించే దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. చైతన్యపురి ఇన్‌స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. యాచారం మండలం చింతపట్ల గ్రామానికి చెందిన జి.మల్లేష్(45), సంతోషి(37) భార్యాభర్తలు. వీరు కొత్తపేట మార్గదర్శి కాలనీలో నివాసం ఉంటూ రైతుబజార్ ముందు ఫుట్‌పాత్‌పై కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. కొంత కాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వీరు కొద్ది రోజుల క్రితం తమ స్వగ్రామంలో ఉన్న రెండు ఎకరాల భూమిని విక్రయించినా అప్పులు తీరలేదు. దీంతో దంపతులిద్దరూ మానసికంగా ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం ఉదయం 5.30 గంటల సమయంలో మల్లేష్, సంతోషి నడక కోసం బయటకు వెళ్లారు. ఆ సమయంలో వారి కుమారుడు, కుమార్తెలు శివ, మేఘన, మౌనిక నిద్రిస్తున్నారు. ఉదయం 7.45 గంటలయినా తల్లిదండ్రులు ఇంటికి రాకపోవడంతో కుమారుడు శివ తండ్రికి ఫోన్ చేయగా ఎంతకూ ఎత్తలేదు. కొద్దిసేపటి తరువాత తన పేరు మీద రూ.20 లక్షలు, తల్లి పేరు మీద రూ.20 లక్షలు ఎస్‌బీఐ బ్యాంక్ నుంచి వస్తాయని మల్లేష్ కుమారుని సెల్‌కు వాయిస్ మెసేజ్ పంపించి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. దీంతో ఆందోళనకు గురైన కుమారుడు శివ బంధువులకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అతడి ఫిర్యాదు మేరకు చైతన్యపురి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తట్టిఅన్నారంలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో విషం తాగి అపస్మారక స్థితిలో ఉన్న దంపతులిద్దర్నీ పోలీసులు గుర్తించారు. పరిశీలించగా సంతోషి అప్పటికే మృతి చెందింది. అపస్మారక స్థితిలో ఉన్న మల్లే్‌షను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం అతడు మృతి చెందినట్లు వెల్లడించారు.