Uttam Kumar Reddy: జల వివాదాలపై అసెంబ్లీలో రోజంతా చర్చ!
ABN , Publish Date - Dec 21 , 2025 | 07:04 AM
ఈనెలాఖరున లేదా జనవరి తొలివారంలో జరుగుతాయని భావిస్తున్న శాసనసభ సమావేశాల్లో ‘జల వివాదాలు-వాస్తవాలు’ అనే అంశంపై ఒక రోజంతా చర్చ జరిగే అవకాశం ఉందని...
అధికారులు నివేదికతో సిద్ధంగా ఉండాలి
బీఆర్‌ఎస్ అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టాలి
నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్
హైదరాబాద్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఈనెలాఖరున లేదా జనవరి తొలివారంలో జరుగుతాయని భావిస్తున్న శాసనసభ సమావేశాల్లో ‘జల వివాదాలు-వాస్తవాలు’ అనే అంశంపై ఒక రోజంతా చర్చ జరిగే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో నివేదికతో సిద్ధంగా ఉండాలని నీటిపారుదల శాఖ ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. జల వివాదాలపై బీఆర్‌ఎస్ అవాస్తవిక ప్రచారాన్ని తిప్పికొట్టాలని, తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నీటిపారుదల శాఖలో తీసుకున్న నిర్ణయాలు, వాటి వల్ల కలిగిన నష్టాలపై నివేదిక ఉండాలని సూచించారు. ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టకుండా మేడిగడ్డకు తరలించడంతో వాటిల్లిన నష్టాలను నివేదికలో ప్రధానంగా చేర్చాలన్నారు. ఉమ్మడి ఏపీలో శ్రీశైలం నుంచి ఏపీ తరలించిందెంత?, తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో తరలించిందెంత? వంటి అంశాన్ని ఎత్తిచూపాలని సూచించారు. ఎస్‌ఎల్‌బీసీతోపాటు కృష్ణా బేసిన్‌లో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి చేయకుండా గత ప్రభుత్వం అనుసరించిన నిర్లక్ష్యాన్ని కూడా నివేదికలో పొందుపరచాలని నిర్దేశించారు. పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టులోని పలు కాంపోనెంట్లను బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే ప్రతిపాదించడాన్ని కూడా చేర్చాలన్నారు. ‘బేసిన్లు లేవు.. భేషజాలు లేవ’ని మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించిన అంశాలతో పాటు ఏపీ మాజీ సీఎం జగన్‌తో భేటీ సందర్భంగా జరిగిన చర్చల అంశాలు నివేదికలో రికార్డు కావాలని చెప్పారు. ఆదివారం జరిగే బీఆర్‌ఎస్ శాసనసభాపక్షం సమావేశంలో కేసీఆర్ ప్రసంగం ఆధారంగా ఆ వాదనల్లో వాస్తవాలపై వెంటనే నివేదిక సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
నిర్మాణ సంస్థలకు చివరి అవకాశం
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు నిర్మాణ సంస్థలు సొంత నిధులతో ముందుకు రాకపోతే కఠిన చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో ఎల్ అండ్ టీ (మేడిగడ్డ), అఫ్కాన్స్ (అన్నారం), నవయుగ (సుందిళ్ల)కు తుది నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించింది. ఆయా సంస్థలు అనుకూలంగా స్పందించకపోతే క్రిమినల్ కేసులు నమోదుచేసి, బ్లాక్‌లిస్టులో పెట్టాలని స్పష్టం చేసింది. ధరావతు కింద సమర్పించిన నిధులను కూడా జప్తు చేయాలని పేర్కొంది.