Family Dispute: 20 గుంటల భూమి కోసం..కన్నతల్లిని కడతేర్చిన కూతురు
ABN , Publish Date - Oct 20 , 2025 | 04:52 AM
20 గుంటల భూమి కోసం ఓ మహిళ తన కన్నతల్లినే కడతేర్చింది. భర్త, మరొకరితో కలిసి ఘాతుకానికి తెగబడింది. నిద్రలో ఉన్న తల్లి గొంతునులిమి ప్రాణం తీయడమే...
భర్త, మరొకరితో కలిసి ఘాతుకం
తల్లి నిద్రలో ఉండగా గొంతునులిమి హత్య
కాలును కోసి వెండి కడియం అపహరణ
మృతదేహాన్ని చెరువులో పారేసిన వైనం
కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు
మృతదేహం లభించడంతో గుట్టు రట్టు
సిద్దిపేట జిల్లా మినాజీపేటలో ఘటన
వర్గల్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): 20 గుంటల భూమి కోసం ఓ మహిళ తన కన్నతల్లినే కడతేర్చింది. భర్త, మరొకరితో కలిసి ఘాతుకానికి తెగబడింది. నిద్రలో ఉన్న తల్లి గొంతునులిమి ప్రాణం తీయడమే కాక, తల్లి కాలును కత్తితో కోసి.. కాలికి ఉన్న వెండి కడియాలు కాజేసింది. మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి చెరువులో పారేసింది. ఆపై, అమ్మ కనిపించడం లేదంటూ అమాయకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ, చెరువులో పారేసిన మృతదేహం ఎనిమిది రోజుల తర్వాత లభించడంతో ఆ కూతురు కిరాతకం బయటపడింది. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మినాజీపేటలో జరిగిన ఈ దారుణ ఘటనలో మంకని బాలమణి (55) అనే మహిళ తన కూతురి చేతిలో హత్యకు గురైంది. ఇందుకు సంబంధించి గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మినాజీపేటకు చెందిన మంకని బాలమణి (55), చిన్న బాలనర్సయ్య దంపతులకు లావణ్య, నవనీత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు లావణ్యకు ములుగు మండలం తునికి బొల్లారం గ్రామానికి చెందిన బిక్షపతితో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. చిన్న కూతురు నవనీతకు మినాజీపేటకే చెందిన మధుతో పెళ్లయింది. మధుకు రక్తసంబంధీకులు ఎవ్వరూ లేకపోవడంతో నవనీత దంపతులు బాలామణితో కలిసే ఉంటున్నారు. బాలమణి తమకున్న రెండెకరాల వ్యవసాయ భూమిలో కొంత భూమిని గతంలో లావణ్య పేరును రాసింది. మరికొంత భూమిని అమ్మి వచ్చిన డబ్బును చిన్నకూతురు నవనీతకు ఇచ్చింది. మరో 20గుంటల భూమిని లావణ్య ఇవ్వాలని, అది పోగా మిగిలిన భూమిని నవనీతకు ఇవ్వాలని అనుకుంది. ఇదే విషయాన్ని నవనీతకు చెప్పింది. కానీ, అక్కకు భూమి ఇవ్వడం ఇష్టం లేని నవనీత తల్లితో గొడవ పడింది. మరోపక్క, బాలమణి కొద్ది నెలల క్రితం తూప్రాన్ మండలం యావపురంలో ఉంటున్న తన అక్క కొడుకు రాయని గౌరయ్యకు రూ.3లక్షలు అప్పుగా ఇచ్చింది. ఆ విషయం లో బాలమణి, గౌరయ్యకు గొడవలు ఉన్నాయి.
తల్లిని చంపేందుకు పథకం
తల్లి బతికుంటే 20 గుంటల భూమి అక్కకు వెళ్లిపోతుందని భావించిన నవనీత.. తల్లి అడ్డుతొలగించుకునేందుకు నిర్ణయించుకుంది. తల్లిని హత్య చేసేందుకు భర్తతోపాటు, గౌరయ్యతో చేయి కలిపింది. తమకు సహకరిస్తే రూ.3 లక్షలు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి గౌరయ్యను ఒప్పించింది. ఇక, అక్టోబరు 10వ తేదీ రాత్రి తండ్రి బాలనర్సయ్య ఇంటి బయట నిద్రిస్తుండగా.. నవనీత, ఆమె భర్త మధు, గౌరయ్య ఇంట్లోకి ప్రవేశించారు. నిద్రలో ఉన్న బాలమణి కదలకుండా కాళ్లు, చేతులు పట్టుకొని ముక్కు, నోరు మూసి, గొంతునులిమి చంపేశారు. అనంతరం బాలమణి మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి గౌరయ్య తెచ్చిన ఆటోలో ఎక్కించి తునికి బొల్లారం సమీపంలోని అయ్యప్ప చెరువుకి తీసుకెళ్లారు. అక్కడ తొలుత బాలమణి కాళ్లకు ఉన్న వెండి కడియాలు తీసుకున్నారు. ఎడమ కాలు కడియం రాకపోవడంతో కత్తితో ఆ కాలును రెండుగా కోసి మరీ కడియాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత మృతదేహాన్ని చెరువులో పారేశారు. అనంతరం తల్లి కనిపించడం లేదంటూ నవనీత ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు పెట్టారు. ఈ క్రమంలో శనివారం(అక్టోబరు 18) సదరు చెరువులో కుళ్లిపోయిన స్థితిలో ఓ మృతదేహం లభించగా.. అది బాలమణి మృతదేహమేనని, ఆమె హత్యకు గురైందని పోలీసులు గుర్తించారు. ఆపై, నవనీత, లావణ్యను పోలీసులు విచారించగా.. నవనీత చేసిన ఘోరాన్ని బయటపెట్టింది. దీంతో నవనీత, ఆ భర్త మధు, వారికి సహకరించిన గౌరయ్యను పోలీసులు అరెస్టు చేశారు.