Dasara Festivities Cause Traffic Surge: పండుగకి ఊరెళ్లిపోదాం!
ABN , Publish Date - Oct 02 , 2025 | 05:05 AM
దసరా పండుగను జరుపుకునేందుకు హైదరాబాద్ వాసులు చాలామంది సొంతూరి బాటపట్టారు. గురువారం నుంచి ఆదివారం వరకు....
దసరా ప్రయాణాలతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిట
హైదరాబాద్- విజయవాడ హైవే సహా రహదారులన్నీ బిజీబిజీ
తిరుగు ప్రయాణాలకు 5, 6 తేదీల్లో టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
హైదరాబాద్ సిటీ, చౌటుప్పల్ టౌన్/ బీబీనగర్/ కేతేపల్లి, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): దసరా పండుగను జరుపుకునేందుకు హైదరాబాద్ వాసులు చాలామంది సొంతూరి బాటపట్టారు. గురువారం నుంచి ఆదివారం వరకు వరుసగా సెలవులు ఉండడంతో హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తమ సొంతూళ్లు బయలుదేరారు. దీంతో హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వెళ్లే రహదారులు, ఏపీకి వెళ్లే రహదారులు బుధవారం ఉదయం నుంచే రద్దీగా మారాయి. హైదరాబాద్‌లోని ఆర్టీసీ బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ నుంచి బుధవారం రాత్రి తొమ్మిది గంటల వరకు 2,600 రెగ్యులర్ సర్వీసులతోపాటు మహబూబ్‌నగర్ సెక్టార్, విజయవాడ, ఖమ్మం, రాయచూర్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు 300కు పైగా ప్రత్యేక బస్సులు వెళ్లాయి. జూబ్లీ బస్టాండ్ నుంచి గత రెండ్రోజుల్లో 500 ప్రత్యేక బస్సులు నడిపారు. పండగ రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి 800కు పైగా సిటీ బస్సులను సమీప జిల్లాలకు ఆర్టీసీ అధికారులు తరలించారు. అలాగే, పండగ అనంతరం జిల్లాల నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చే వారి కోసం అక్టోబరు 5, 6 తేదీల్లో టీజీఎ్‌సఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. మరోపక్క, దసరా ప్రయాణాలతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో బుధవారం ట్రాఫిక్ విపరీతంగా ఉంది. వాహనాల సంఖ్య అధికంగా ఉండడంతో నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ శివారులోని టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్ నెమ్మదించింది. విజయవాడ రూట్‌లో టోల్ ప్లాజాలో అదనపు కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల పరిధిలోని ఎన్‌హెచ్-163రహదారి(హైద్రాబాద్-భూపాపల్లి) గూడూరు టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ కనిపించింది. ఈ టోల్ ప్లాజా నుంచి సాధారణ రోజుల్లో 19వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. బుధవారం మరో నాలుగు వేల వాహనాలు అదనంగా రాకపోకలు సాగించినట్టు టోల్‌ప్లాజా సిబ్బంది తెలిపారు.