Vemulawada Rajanna Temple: రాజన్న సన్నిధిలో దర్శనాలు నిలిపివేత
ABN , Publish Date - Nov 13 , 2025 | 04:30 AM
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. ఆలయంలో జరుగుతున్న అబివృద్ధి పనులకు ఆటంకం కలుగుతున్న....
ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా అధికారుల నిర్ణయం
ముందస్తు సమాచారం లేకపోవడంతో భక్తుల ఆగ్రహం
భీమేశ్వరాలయంలోనే పూర్తిస్థాయి దర్శనాలు
వేములవాడ టౌన్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. ఆలయంలో జరుగుతున్న అబివృద్ధి పనులకు ఆటంకం కలుగుతున్న దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఆలయ రాజగోపురం దక్షిణం వైపు ఉన్న ప్రధాన ద్వారానికి ఎత్తైన రేకులతో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి దర్శనాలను నిలిపివేశారు. రాజన్న ఆలయ విస్తరణలో భాగంగా దాదాపు రూ.76కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్న క్రమంలో కళాభవన్, పరిపాలనా కార్యాలయం, ఇతర భవనాలను ఇప్పటికే కూల్చివేశారు. ఇప్పటికే రాజన్న సన్నిధిలో ఆర్జిత సేవలు నిలిపివేసి భీమేశ్వరాలయంలో కొనసాగిస్తున్నారు. ఆలయంలో లఘు దర్శనం కొనసాగిస్తున్న క్రమంలో కార్తీకమాసం దృష్టా భక్తుల సంఖ్య పెరగడంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విస్తరణ పనుల వల్ల భక్తులకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని అధికారులు తీవ్రంగా పరిగణించి దర్శనాలను నిలిపివేశారు. దీంతో రాజన్న సన్నిధిలో యథావిధిగా స్వామివారికి చతుస్కాల పూజలు కొనసాగిస్తూ, భక్తుల దర్శనాలు పూర్తిస్థాయిలో భీమేశ్వర ఆలయంలో కొనసాగించడానికి ఏర్పాట్లు చేశారు. దీంతో బుధవారం స్వామివారి సుప్రభాత దర్శనానికి వచ్చిన భక్తులు ఆలయ ఆవరణ అంతటా రేకులతో ఫెన్సింగ్ చేసి ఉండడాన్ని చూసి అవాక్కయ్యారు. ముందస్తు సమాచారం లేకుండా దర్శనాలు నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ ప్రధాన ద్వారం ఎదురుగా రావిచెట్టు వద్ద ఏర్పాటు చేసిన స్వామివారి ప్రచార రథంలోని ఉత్సవ విగ్రహాలను, ఎల్‌ఈడీ స్ర్కీన్ ద్వారా రాజన్నను దర్శించుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆర్జిత సేవలైన అభిషేకం, కల్యాణం, సత్యనారాయణ వ్రతం, కుంకుమపూజలు, అన్నపూజ, ఆకుల పూజ, కోడె మొక్కుల కోసం భీమేశ్వరాలయంలో అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఇవో రమాదేవి తెలిపారు.