Share News

యాదగిరీశుడికి శాస్త్రోక్తంగా నిత్య పూజలు

ABN , Publish Date - Jun 05 , 2025 | 12:14 AM

యాద గిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో బుధవారం నిత్య పూజలు వైభవంగా నిర్వహించారు.

యాదగిరీశుడికి శాస్త్రోక్తంగా నిత్య పూజలు
లక్ష్మీనరసింహ స్వామి నిత్య కల్యాణోత్సవం నిర్వహిస్తున్న అర్చకుడు

యాదగిరిగుట్ట, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): యాద గిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో బుధవారం నిత్య పూజలు వైభవంగా నిర్వహించారు. సుప్రభాతంతో స్వామి అమ్మవారిని మేల్కొలిపిన అర్చకులు గర్భగుడిలో కొలువుదీరిన స్వయంభువులు, సువర్ణ ప్రతిష్ఠామూర్తులను అభిషేకించారు. ప్రధానా లయం అష్టభుజి ప్రాకార మండపంలో స్వామి అమ్మవారిని అలంకరించి ప్రత్యేక వేదికపై తీర్చిదిద్ది సుదర్శన శతక పఠనాలతో హవనం నిర్వహించారు. అనంతరం గజ వాహన సేవలో ఊరేగించి విష్వక్సేనుడి తొలి పూజలతో నిత్య తిరుకల్యాణోత్సవం నిర్వహించారు. సాయంత్రం ముఖమండపంలో దర్బారు సేవోత్సవం చేపట్టిన ఆచార్యులు అలంకార వెండిజోడు సేవలు, సహస్రనామార్చనలు చేపట్టారు. పాతగుట్ట ఆలయంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ నిత్య పూజలు కొనసాగాయి. కొండపై శివాలయంలో పర్వతవర్థిని రామలింగేశ్వర స్వామికి రుద్రహవనం నిర్వహించారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ. 22,04,444ల ఆదాయం సమకూరినట్లు ఈవో ఎస్‌. వెంకట్రావు తెలిపారు.

మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీ నృసింహుని క్షేత్రంలో శ్రీరాజ్యలక్ష్మీ, చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నరసింహుడి నిత్య కల్యాణాన్ని వేదపండితులు బుధవారం వైభవంగా నిర్వహించారు. రాజ్యలక్ష్మీ, చెంచులక్ష్మీ సమేత భక్తవత్సలునికి నిజాభిషేకం, నిత్యార్చనలు చేశారు. అనంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం ఆర్జిత కైంకర్యాలు జరిగాయి. ఉదయం హోమాధికాలు నిర్వహించారు. కల్యాణ మూర్తులను పరిణయోత్సవ వేదికపైకి వేంచేయించి పుణ్యాహవాచనం నిర్వహించారు. పాదప్రక్షాళనం మధుపర్క పూజలు యాథావిధిగా చేపట్టారు. మంగళ్యధారణ, యజ్ఘోపవీత ధారణలు అనంతరం దివ్యమూర్తులకు గరుడోత్సవం జరిగింది. మధ్యాహ్నం అమ్మవారికి కుంకుమార్చన, విశేషపర్వాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈవో సిరికొండ నవీన్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2025 | 12:14 AM