Share News

Jubilee Hills bypoll campaign: కూలీలకు 400, విద్యార్థులకు వెయ్యి!

ABN , Publish Date - Oct 31 , 2025 | 02:38 AM

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని కార్మికుల అడ్డాలు వెలవెలబోతున్నాయి. ఉదయం ఎనిమిది గంటల కల్లా కూలీలతో రద్దీగా ఉండే ఆయా ప్రాంతాలు ఇటీవల ఖాళీగా కనిపిస్తున్నాయి....

Jubilee Hills bypoll campaign: కూలీలకు 400, విద్యార్థులకు వెయ్యి!

  • జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలో దినసరి కూలీలు

  • రోజుకు రూ.400-800 వరకు కూలీ, భోజనం

  • ఓటర్ల వివరాల సేకరణకు ఇంటింటికీ విద్యార్థులు

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని కార్మికుల అడ్డాలు వెలవెలబోతున్నాయి. ఉదయం ఎనిమిది గంటల కల్లా కూలీలతో రద్దీగా ఉండే ఆయా ప్రాంతాలు ఇటీవల ఖాళీగా కనిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని కృష్ణానగర్‌, రహ్మత్‌నగర్‌ డివిజన్‌లోని కార్మికనగర్‌, బోరబండ, శ్రీనగర్‌ కాలనీ ప్రాంతాల్లో కార్మికుల అడ్డాలు ఉన్నాయి. సాధారణ రోజుల్లో ఉదయం 8 గంటలకే కూలీలంతా అక్కడికి వచ్చి ఉపాధి కోసం నిలబడతారు. ఎవరైనా అటుగా వస్తే.. పని ఉందా సార్‌ ? అంటూ ఎగబడతారు. అయితే, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచార పర్వం మొదలైనప్పటి నుంచి ఈ అడ్డాల్లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. రాజకీయ పార్టీలు తమ ప్రచార కార్యక్రమాల అవసరాలకు దినసరి కూలీలను వినియోగిస్తుండడమే ఇందుకు కారణం. నియోజకవర్గంలో ఏడు డివిజన్లు ఉండగా.. ఒక్కో రాజకీయ పార్టీ పది నుంచి 12 ప్రాంతాల్లో ఒకేసారి ప్రచారం నిర్వహిస్తోంది. అభ్యర్థి ఉన్నా లేకున్నా పార్టీ ఇన్‌చార్జిలుగా ఉన్న నేతలు, కార్యకర్తలతో కలిసి ప్రచారం చేస్తున్నారు. ప్రచారానికి వెళ్లే బృందాల్లోని నేతల వెంట వందల మంది ఉండేలా పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. ప్రచార బృందాల్లో నాయకులు, కార్యకర్తలు కొంతమంది ఉంటుండగా.. పార్టీ జెండాలు మోసేందుకు, పోస్టర్లు అంటించేందుకు అడ్డా కూలీలను పార్టీలు వినియోగిస్తున్నాయి. కూలీ డబ్బుతోపాటు భోజనం కూడా దొరుకుతుండడంతో కూలీలు కూడా అడ్డాల దగ్గర వేచి ఉండకుండా పార్టీ కార్యాలయాలకే వెళ్లిపోతున్నారు.


రోజుకు 400, మధ్యాహ్నం భోజనం

నియోజకవర్గంలో ఉదయం, సాయంత్రం రెండు దఫాలుగా ప్రచారం జరుగుతోంది. రెండు పూటలా ప్రచారానికి వచ్చిన వారికి రోజుకి రూ.400 నుంచి రూ.600 వరకు, ఒక పూట ప్రచారంలో పాల్గొంటే రూ.200- 300 వరకు కూలీ ఇస్తున్నారు. ఓ పార్టీ అభ్యర్థి రూ.800 కూడా ఇస్తున్నట్టు తెలిసింది. అభ్యర్థి, పార్టీ నేతలు ప్రచార సమయంలో తమ వెంట 100 మందికి తగ్గకుండా జనం ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇందులో 30-40 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలుంటే.. మిగతా వాళ్లు కూలీలే. డబ్బుకి డబ్బు, కడుపు నిండా భోజనం లభిస్తుండడంతో కూలీలూ ప్రచార పనికే మొగ్గు చూపుతున్నారు. ఇందిరానగర్‌లో ఉండే జూనియర్‌ ఆర్టిస్టుల కూడా షూటింగ్‌లు లేనప్పుడు ప్రచారానికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. డిమాండ్‌ ఉండడంతో ఇతర ప్రాంతాల్లోని అడ్డా కూలీలనూ ప్రచారానికి పిలుస్తున్నారు.

విద్యార్థులకు రూ.1000.

ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులను కూడా రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి వినియోగించుకుంటున్నాయి. పోలింగ్‌ బూత్‌ల వారీగా ఓటర్ల జాబితా ఇచ్చి ఇంటింటి పరిశీలన చేసే పనిని అప్పగిస్తున్నాయి. విద్యార్థులు తమకు కేటాయించిన బూత్‌ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి.. చిరునామాలో ఆ ఓటర్‌ ఉన్నాడా..? లేదా..? ఉంటే జాబితాలో వారి పేరుపై టిక్‌చేసి మొబైల్‌ నెంబర్‌ తీసుకుంటున్నారు. ఆ వివరాలను సంబంధిత పార్టీ/అభ్యర్థికి ఇస్తున్నారు. ఇందుకు గాను విద్యార్థులకు రోజుకు రూ.1000 చొప్పున పార్టీలు చెల్లిస్తున్నాయి. విద్యార్థులు తెచ్చి ఇచ్చిన సమాచారం ఆధారంగా పార్టీల అభ్యర్థులు ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌, సందేశాల ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే, టెలీ కాలర్ల ద్వారా ఫోన్లు చేయించి ఎవరికి ఓటు వేస్తారని కూడా పార్టీలు తెలుసుకుంటున్నాయి.

Updated Date - Oct 31 , 2025 | 02:38 AM