Thummala Nageswara Rao: మొంథా దెబ్బ.. 1,17,757 ఎకరాల్లో పంట నష్టం
ABN , Publish Date - Nov 12 , 2025 | 02:38 AM
మొంథా తుపాను ప్రభావంతో రాష్ట్రంలో దెబ్బతిన్న పంటల లెక్క తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,17,757 ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ తుది నివేదిక ఇచ్చింది....
భారీగా దెబ్బతిన్న వరి, పత్తి, మొక్కజొన్న
నాగర్‌కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 23,580 ఎకరాల్లో నష్టం
వ్యవసాయశాఖ క్షేత్రస్థాయి సర్వేలో వెల్లడి
హైదరాబాద్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): మొంథా తుపాను ప్రభావంతో రాష్ట్రంలో దెబ్బతిన్న పంటల లెక్క తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,17,757 ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ తుది నివేదిక ఇచ్చింది. 33 శాతానికి పైగా నష్టపోయిన పంటలనే అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. ఆ నివేదిక ప్రకారం 83,407 ఎకరాల్లో వరి, 30,144 ఎకరాల్లో పత్తి, 2,097 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో 23,580 ఎకరాల్లో పంటనష్టం జరిగింది. వరంగల్ జిల్లాలో 19,736 ఎకరాలు, కరీంనగర్ జిల్లాలో 11,473 ఎకరాలు, హనుమకొండ జిల్లాలో 11,310 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. జనగామ, జగిత్యాల, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, నల్లగొండ, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వనపర్తి జిల్లాల్లో కూడా పంట నష్టం సంభవించింది. మొత్తం 27 జిల్లాల్లో పంటలు దెబ్బతినగా 1,22,242 మంది రైతులు నష్టపోయారు. వీరికి నష్టపరిహారం ఇవ్వడానికి రూ.117.75 కోట్ల మేర నిధులు అవసరమని వ్యవసాయశాఖ తన నివేదికలో పేర్కొంది.
ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ నిధుల కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ
మొంథా తుఫాను ప్రభావంతో జరిగిన పంటనష్టానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పరిహారం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ‘ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ’ కింద రాష్ట్రానికి సాయం అందించాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నారు. ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ నిబంధనల ప్రకారం.. ఇసుకమేటలు వేస్తే ఎకరానికి రూ.7,235, నీటిపారుదల కింద సాగైన పంటలకైతే ఎకరానికి రూ.6,880, వర్షాధార పంటలైతే ఎకరానికి రూ.3,440, తోటలకు ఎకరానికి రూ.9,106 చొప్పున మొత్తం రాష్ట్రానికి రూ.70 కోట్ల నిధులు ఇవ్వాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వానికి లేఖలో వివరించనున్నారు.
ఎకరానికి రూ.10 వేల ఆర్థిక సాయం: తుమ్మల
ప్రకృతి విపత్తుల వల్ల రైతులు పంట నష్టపోతే ఎకరానికి రూ.10 వేల చొప్పున నష్ట పరిహారం చెల్లిస్తున్నామని, మొంథా తుపాను బాధిత రైతులకు కూడా ఎకరానికి రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల తెలిపారు. మొంథా తుపానువల్ల జరిగిన పంట నష్టాన్ని పరిశీలించి అంచనా వేయటానికి కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపాలని కోరుతామని తెలిపారు.
ఏటా రెండు లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు
పామాయిల్ సాగుకు రాష్ట్రంలో 12 లక్షల ఎకరాలకు పైగా అనువైన భూములున్నాయని, వచ్చే నాలుగేళ్లలో ఏటా 2 లక్షల ఎకరాల్లో సాగు జరగాలని పామాయిల్ కంపెనీల ప్రతినిధులకు మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. పామాయిల్ కంపెనీల ప్రతినిధులు, ఉద్యానశాఖ అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాదిలో ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక పామాయిల్ ప్రాసెసింగ్ పరిశ్రమ స్థాపనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈనెలలో నర్మెట్ట(సిద్దిపేట)లో 30- 120 టన్నుల సామర్థ్యంతో ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని చెప్పారు.