Cyberabad Police Commissioner Avinash Mahanti: సైబరాబాద్‌లో తగ్గిన సైబర్ నేరాలు
ABN , Publish Date - Dec 24 , 2025 | 05:51 AM
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 2025లో జరిగిన నేరాల్లో సైబర్ నేరాల వాటానే అధికం. అయితే, 2024తో పోలిస్తే మాత్రం 2025లో సైబర్ నేరాల సంఖ్య తగ్గింది...
2024లో 11,914 కేసులు.. 2025లో 7,636 కేసులు
నేర వార్షిక నివేదిక వెల్లడించిన సైబరాబాద్ సీపీ
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 2025లో జరిగిన నేరాల్లో సైబర్ నేరాల వాటానే అధికం. అయితే, 2024తో పోలిస్తే మాత్రం 2025లో సైబర్ నేరాల సంఖ్య తగ్గింది. సైబరాబాద్ కమిషనరేట్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో 2025 వార్షిక నేర నివేదికను సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి వెల్లడించారు. దాని ప్రకారం.. శిక్షార్హమైన నేరాలకు సంబంధించి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2025లో మొత్తం 37,243 కేసులు నమోదయ్యాయి. 2024లో ఈ సంఖ్య 37,689గా ఉంది. ఈ ఏడాది నమోదైన కేసుల్లో సైబర్ నేరాల వాటానే అధికం. 2024లో మొత్తం 11,914 సైబర్ క్రైమ్ కేసులు నమోదవ్వగా.. 2025లో 7,636 కేసులు నమోదయ్యాయి. ఇందులో పార్ట్‌టైమ్ జాబ్స్ మోసాలకు సంబంధించిన కేసులు 2,079, ట్రేడింగ్ మోసాలు 1256, స్మిషింగ్ మోసాలు 689, డిజిటల్ అరెస్టు కేసులు 117 ఉన్నాయి. ఆయా కేసుల్లో సైబర్ నేరగాళ్లు రూ.404.61 కోట్లు కొల్లగొట్టగా ఇందులో రూ. 20.75కోట్లు రికవరీ చేసిన పోలీసులు బాధితులకు అందజేశారు. సైబర్ నేరాలకు సంబంధించిన 7,636 కేసుల్లో 539 కేసులనే ఛేదించిన పోలీసులు 917మందిని అరెస్టు చేశారు. మాదక ద్రవ్యాలకు సంబంధించి ఈ ఏడాదిలో 575 కేసులు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు 1228 మందిని అరెస్టు చేశారు. రూ.16.85 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు. ఇక, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 2025లో రూ.239.37 కోట్ల విలువైన చలాన్లను వాహనాలపై విధించారు. 15,706 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. సైబరాబాద్ పోలిస్ కమిషనరేట్ పరిఽధిలో 2025లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 803 మంది మరణించారు. ఇక, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐటీ కారిడార్‌లోని వివిధ ప్రాంతాల్లో 24 గంటల వ్యవధిలో 20 లక్షల దాకా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్టు గుర్తించామని పోలీసులు వెల్లడించారు.