DGP Shivadhar Reddy highlighted cybercrime: సైబర్ క్రైం తీవ్రమైన సామాజిక సమస్య
ABN , Publish Date - Nov 10 , 2025 | 03:03 AM
సైబర్ క్రైమ్ తీవ్రమైన సామాజిక సమస్యగా మారిందని డీజీపీ శివధర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్‌నేరాలపై అవగాహన కల్పించేందుకు...
కుటుంబానికో సైబర్ సింబతోనే సమాజం సురక్షితం
‘జాగృత్ హైదరాబాద్-సురక్షిత్ హైదరాబాద్’లో డీజీపీ
డబ్బులు ఊరకే రావు: సీపీ సజ్జనార్
హైదరాబాద్ సిటీ/కవాడిగూడ, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): సైబర్ క్రైమ్ తీవ్రమైన సామాజిక సమస్యగా మారిందని డీజీపీ శివధర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్‌నేరాలపై అవగాహన కల్పించేందుకు లోయర్ ట్యాంక్‌బండ్‌లోని కవాడిగూడ జల వాయు టవర్స్ కమ్యూనిటీ హాలులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అధ్యక్షతన ఆదివారం జరిగిన ‘జాగృత్ హైదరాబాద్- సురక్షిత్ హైదరాబాద్’ కార్యక్రమాన్ని డీజీపీ ప్రారంభించారు. సైబర్ సింబ లోగో, క్యూఆర్ కోడ్‌లను ఆవిష్కరించి.. బ్యాడ్జీలను వలంటీర్లకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు అమాయక మహిళలు, వృద్ధులు, రిటైర్డు ఉద్యోగులను భయపెట్టి, బెదిరించి, వారి బ్యాంకు ఖాతాల్లోని రూ.కోట్లు ఖాళీ చేస్తున్నారన్నారు. ఇటువంటి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు చెప్పారు. సైబర్ మోసాలపై ప్రతి ఇంట్లో అవగాహన గల ఒక సైబర్ సింబ ఉంటే సమాజం సురక్షితంగా ఉంటుందని డీజీపీ అన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని చెప్పారు. సజ్జనార్ మాట్లాడుతూ.. డబ్బులు ఊరకే రావని గుర్తించాలన్నారు. రోజూ సైబర్ మోసాలతో హైదరాబాదీలు సగటున రూ.కోటి వరకూ నష్టపోతున్నారని చెప్పారు. ఏడాదికి సగటున రాష్ట్ర ప్రజలనుంచి సైబర్ మోసగాళ్లు రూ.400కోట్లు దోచుకుంటున్నారని ఆందోళనవ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారితో సజ్జనార్ సైబర్ ప్రతిజ్ఞ చేయించారు.