Cyberabad Traffic Fines: సైబరాబాద్‌లో ఏడాదిలో రూ.239.37కోట్ల చలాన్లు
ABN , Publish Date - Dec 26 , 2025 | 05:23 AM
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది కాలం(2025లో ఇప్పటివరకు)లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి రూ.239.37 కోట్ల చలాన్లు విధించారు....
గతేడాదితో పోలిస్తే రెట్టింపు కన్నా ఎక్కువ
36లక్షలకు పైగా వాహనాలపై విధింపు
రాంగ్ సైడ్ డ్రైవింగ్ చలాన్లు 50వేలకు పైగా నమోదు
సైబరాబాద్ ట్రాఫిక్ వార్షిక నివేదిక వెల్లడి
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది కాలం(2025లో ఇప్పటివరకు)లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి రూ.239.37 కోట్ల చలాన్లు విధించారు. ఇది గతేడాదితో పోల్చితే రెట్టింపు కన్నా ఎక్కువ కావడం గమనార్హం. ట్రాపిక్ ఉల్లంఘనలపై విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ వివరాలను సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి వెల్లడించారు. ఇందులో వాహనాలను ఆపి ట్రాఫిక్ పోలీసులు విధించిన చలాన్లు 10,27,335 ఉండగా, ఈ-చలాన్లు 25,93,152 ఉన్నా యి. ఈ రెండు రకాల చలాన్ల మొత్తం విలువ రూ. 239.37 కోట్లు అని వార్షిక నివేదికలో పేర్కొన్నారు. 36లక్షలకు పైగా వాహనాలపై చలాన్లు విధించారు. గతేడాది ట్రాఫిక్ చలాన్ల మొత్తం విలువ రూ.111.81 కోట్లు అని తెలిపారు. వార్షిక నివేదిక నివేదిక ప్రకారం.. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిఽధిలో సుచిత్ర, బయో డైవర్సిటీ, బాలానగర్ టీ జంక్షన్ సహా పలు కూడళ్లను సిగ్నల్ ఫ్రీ జంక్షన్లుగా మార్పులు చేశారు. అయితే సిగ్నల్ ఫ్రీ జంక్షన్‌లు చేసిన దగ్గర యూ టర్న్‌లు దూరంగా ఉండటంతో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇది ట్రాఫిక్ పోలీసులు విధించిన చలాన్లలో స్పష్టమవుతోంది. ఈ ఏడాదిలో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చలాన్ల సంఖ్య 50వేలకు పైనే ఉంది. ఇదిలా ఉండగా, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సరిపడా ట్రాఫిక్ సిబ్బంది లేరు. 16 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లు ఉన్నా, క్షేత్ర స్థాయిలో చౌరస్తాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించే వారు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తులను ట్రాఫిక్ మార్షల్స్‌గా ఎంపిక చేసి వారితో విధులు నిర్వహించేలా చేస్తున్నారు. 2024లో 95 మంది ట్రాఫిక్ మార్షల్స్ ఉండగా, 2025లో అది 172 మందికి పెరిగింది.