Cyberabad Police: సృష్టి కేసులో బెయిల్‌పై వచ్చి శిశువుల విక్రయం
ABN , Publish Date - Dec 25 , 2025 | 05:20 AM
కొన్నాళ్ల కిందట సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మోసం కేసులో అరెస్టైన నిందితులే బెయిల్‌పై బయటకొచ్చి శిశువులను కొని అంగట్లో సరుకులా అమ్ముతున్నారు.....
గుజరాత్, సిద్దిపేటలో ఇద్దరు శిశువులను కొని తెచ్చిన ముఠా
అమ్మే యత్నాల్లో ఉండగా పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు
11 మంది అరెస్టు.. సంరక్షణ కేంద్రానికి శిశువుల తరలింపు
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): కొన్నాళ్ల కిందట సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మోసం కేసులో అరెస్టైన నిందితులే బెయిల్‌పై బయటకొచ్చి శిశువులను కొని అంగట్లో సరుకులా అమ్ముతున్నారు. నిరుపేద దంపతులకు డబ్బు ఆశ చూపి వారి పిల్లల్ని కొని లక్షల రూపాయలకు సంతానం లేని వారికి విక్రయిస్తున్నారు. ఓ ముఠాగా ఏర్పడి ఇతర రాష్ట్రాల నుంచి సైతం శిశువులను కొని తీసుకొస్తున్నారు. ఇలా ఇద్దరు శిశువులను తెచ్చి విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. 20 మంది సభ్యుల ముఠాలో 11 మందిని అరెస్టు చేశారు. మిగతావారి కోసం గాలిస్తున్నారు. అరెస్టైన వారిలో 8 మంది మహిళలు ఉన్నారు. ఈ ముఠాలో కీలకమైన వెంకిపల్లి గంగాధర్ రెడ్డితో పాటు కుమ్మరి హర్ష రాయ్, సంగీతా దేబి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో నిందితులు. అరెస్టై బెయిల్‌పై బయటికొచ్చారు. ఒక్కో శిశువును రూ.6 లక్షల నుంచి 7 లక్షలకు సంతానం లేని దంపతులకు విక్రయిస్తున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని మాదాపూర్ డీసీపీ రితి రాజ్ తెలిపారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. గంగాధర్ రెడ్డి ముఠాలో సభ్యులైన హర్ష రాయ్, దారం లక్ష్మి, సంగీత దేబిలకు సమాచారం ఇచ్చి గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ పంపించాడు. వారు అక్కడ లేబర్ క్యాంప్‌లో ఉంటున్న పేద దంపతుల నుంచి నెలలు నిండని మగశిశువును కొని తెచ్చారు. ఆ శిశువును హైదరాబాద్‌లో విక్రయించబోయారు. మరో మగశిశువును సిద్దిపేట జిల్లా రామన్‌పేటలో కొన్నారు. అందుకు గంగాధర్ రెడ్డి ముఠా సభ్యులైన గూడెపు సుజాత, అనురాధ, జ్యోతి, మాధవి, శోభను పంపించాడు. వేముల బాబు రెడ్డి అనే వ్యక్తి అడగడంతో గంగాధర్ రెడ్డి ఈ శిశువును మంచిర్యాలలో విక్రయించేందుకు కొన్నాడు. ఇద్దరు శిశువులను విక్రయించే ప్రయత్నాల్లో ఉన్న గంగాధర్ రెడ్డి ముఠాను శంషాబాద్ ఎస్‌వోటీ, మియాపూర్ పోలీసులు కలిసి అరెస్టు చేశారు. ముఠా నుంచి ఇద్దరు శిశువులను స్వాధీనం చేసుకుని హైదరాబాద్ శిశు విహార్‌కు తరలించారు. సిద్దిపేట నుంచి తీసుకొచ్చిన శిశువు తల్లిదండ్రులను గుర్తించామని డీసీపీ తెలిపారు. గంగాధర్ రెడ్డిపై ఇప్పటికే 18 కేసులు, బాబు రెడ్డి, హర్ష రాయ్, లక్ష్మిపై ఒక్కొక్కరి మీద రెండు చొప్పున కేసులు ఉన్నాయని చెప్పారు. గంగాధర్ రెడ్డి.. వీర్యదాతలను, సరగసీ కోసం మహిళలను ఐవీఎఫ్ సెంటర్లకు తీసుకొస్తూ ఉంటాడని తెలిపారు. మిగతా నిందితులకు కూడా ఐవీఎఫ్ కేంద్రాలతో సంబంధాలు ఉన్నాయి. వీరితో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. కాగా, శిశువులను కొని తెచ్చి.. సరగసీ ద్వారా పుట్టినట్లు నమ్మించి.. సంతానం లేని దంపతులను మోసగిస్తున్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారం కొన్నాళ్ల కిందట సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గంగాధర్ రెడ్డి ముఠా.. పేద దంపతులను గుర్తించి వారికి డబ్బు ఆశ చూపించి పిల్లలను కొంటున్నారు. ఒక్కో శిశువును మూడు లక్షలకు కొంటున్నట్లు సమాచారం.
అరెస్టైన 11 మంది వీరే..
వెంకిపల్లి గంగాధర్ రెడ్డి, వేముల బాబు రెడ్డి, దారం లక్ష్మి, రాం హరి రాయ్, కుమ్మరి హర్ష రాయ్, సంగీతా దేబి, గూడెపు సుజాత, సూరబోయిన అనురాధ, ఈసారపు జ్యోతి, వీ మాధవి, పోతుల శోభ