Share News

Cyber Scammers : బెట్టింగ్‌ గాలం.. రూ.75లక్షలు స్వాహా

ABN , Publish Date - Dec 16 , 2025 | 04:09 AM

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు అలవాటు పడి ఓ యువకుడు రూ.10లక్షలు పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత బెట్టింగ్‌ను మానేశాడు. కానీ, బెట్టింగ్‌ మాఫియా అతన్ని వదల్లేదు....

Cyber Scammers : బెట్టింగ్‌ గాలం.. రూ.75లక్షలు స్వాహా

  • యువకుడిని నమ్మించి ముంచిన సైబర్‌ నేరగాళ్లు

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు అలవాటు పడి ఓ యువకుడు రూ.10లక్షలు పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత బెట్టింగ్‌ను మానేశాడు. కానీ, బెట్టింగ్‌ మాఫియా అతన్ని వదల్లేదు. సైబర్‌ నేరగాళ్లు ఆ యువకుడికి ఆశ చూపెట్టి, నమ్మించి మళ్లీ బెట్టింగ్‌ ఊబిలోకి లాగి రూ.65లక్షలు కొల్లగొట్టారు. దీంతో, బాధితుడు హైదరాబాద్‌ సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌కు చెందిన 32ఏళ్ల యువకుడికి 2021లో వాట్సా్‌పలో ఓ మెసేజ్‌ వచ్చింది. క్రికెట్‌, తీన్‌పత్తి, క్యాసినో వంటి బెట్టింగ్‌ల గురించి అందులో ప్రస్తావిస్తూ.. తమ యాప్‌ ద్వారా బెట్టింగ్‌లో పాల్గొంటే భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. ‘ఫైవ్‌స్టార్‌ క్రికెట్‌ ఏవియేటర్‌ ఫ్లైట్‌ గేమ్‌’ ప్లాట్‌ఫామ్‌ ద్వారా బెట్టింగ్‌లో పాల్గొనాలని సూచించారు. దీంతో, సదరు యువకుడు ప్రారంభంలో రూ.10వేలు బెట్టింగ్‌ చేశాడు. లాభం రావడంతో బెట్టింగ్‌లను కొనసాగించాడు. క్రమంగా సైబర్‌ నేరగాళ్లు యువకుడినుంచి రూ.10లక్షలు దోచేశారు. ఇక డబ్బులు లేవని భావించిన ఆ యువకుడు బెట్టింగ్‌కు దూరంగా ఉన్నాడు. అయితే, 2022లో సైబర్‌ నేరగాళ్లు ఆ యువకుడిని మళ్లీ సంప్రదించారు. ఈ సారి కొత్త ప్లాట్‌ఫామ్‌లో బెట్టింగ్‌ నిర్వహిస్తున్నామని నష్టాలు వచ్చే అవకాశమే లేదని నమ్మించారు. బాధితుడు మరోసారి బెట్టింగ్‌ ఆడటం ప్రారంభించాడు. ప్రారంభంలో లాభాలు ఇచ్చినట్లు నటించిన సైబర్‌ నేరగాళ్లు మెల్లమెల్లగా యువకుడితో పెద్దఎత్తున బెట్టింగ్‌ చేయించి 2022-2025మధ్యలో రూ.65 లక్షలు కొల్లగొట్టారు. ఇలా 2021 నుంచి ఇప్పటి వరకు మొత్తం రూ.75 లక్షలు నష్టపోయానని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Updated Date - Dec 16 , 2025 | 04:09 AM