Share News

Matrimonial Scam: పెళ్లి మోజులో ఆదమరిచారో ఇల్లు గుల్లే!

ABN , Publish Date - Oct 11 , 2025 | 02:28 AM

చక్కని చుక్కను భార్యగా పొందాలని ఏ అబ్బాయికి ఉండదు? అలాగే అమ్మాయిలు కూడా. జీవితంలో స్థిరపడి.. ఒడ్డూ పొడుగుతో ఆకర్షణీయంగా ఉన్న..

Matrimonial Scam: పెళ్లి మోజులో ఆదమరిచారో ఇల్లు గుల్లే!

  • వివాహ సంబంధాల వెబ్‌సైట్ల పట్ల జాగ్రత్త.. ఈ సైట్లపైనా కన్నేసిన సైబర్‌ నేరగాళ్లు

  • ఫొటోలు, పేర్లు, చిరునామా వివరాలన్నీ నకిలీవే

  • గుడ్డిగా నమ్మి రూ.7.7 కోట్లు పొగొట్టుకున్న టెకీ

  • ఓ వైద్యురాలి నుంచి రూ.10 లక్షలు కాజేసిన ఓ కేటుగాడు

  • అప్రమత్తంగా ఉండండి..

  • సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరక్టర్‌ షికా గోయల్‌ సూచన

హైదరాబాద్‌, అక్టోబర్‌ 10 (ఆంధ్రజ్యోతి): చక్కని చుక్కను భార్యగా పొందాలని ఏ అబ్బాయికి ఉండదు? అలాగే అమ్మాయిలు కూడా. జీవితంలో స్థిరపడి.. ఒడ్డూ పొడుగుతో ఆకర్షణీయంగా ఉన్న యువకుడిని వరుడిగా పొందాలని అనుకుంటారు. అయితే తమకు సరైన భాగస్వామిని వెతుక్కునేక్రమంలో వివాహ సంబంధాల వెబ్‌సైట్లను యువతీయువకులు గుడ్డిగా నమ్మడంతోనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కొందరు కేటుగాళ్లు నకిలీ పేర్లు, ఫొటోలు, చిరునామాలను పొందుపర్చి.. సంబంధాల కోసం చూస్తున్న యువతీయువకుల జేబులు గుల్ల చేస్తున్నారు. ఈ వెబ్‌సైట్లపై సైబర్‌ నేరగాళ్లు కన్నేసి.. రూ.కోట్లలో దోచుకుంటున్నారు. ఇటీవల ఓ యువ వైద్యురాలు.. షాదీ డాట్‌కామ్‌ వెబ్‌సైట్లో ఓ యువ ఎమ్మెల్యే ఫొటోను చూసి ఆకర్షితురాలైంది. ఆ ప్రొఫైల్‌లో ఉన్న ఫోన్‌ నంబర్‌కు ఆమె ఫోన్‌ చేస్తే.. మనసును కట్టిపడేసేలా ఆవలి నుంచి కమ్మని మాటలు వినిపించాయి. ఇద్దరి మధ్య ఫోన్‌ సంభాషణలు, చాటింగ్‌లు పెరిగాయి. ఒకానొక రోజు.. అర్జెంటుగా డబ్బు అవసరం ఉందంటూ ఆ ఫేక్‌ ప్రొఫైల్‌ తాలూకు యువకుడు చెప్పడంతో ఆమె రూ.10 లక్షలు ఆన్‌లైన్‌లో అతడికి పంపించేసింది. ఆ తర్వాత అతడితో మాట్లేందుకు ఆమె ప్రయత్నిస్తే ఫోన్‌ స్విచాఫ్‌ అని వచ్చింది. ఇలా ఈ యువ వైద్యురాలినే కాదు.. మరో 20 మందిని ఆ యువకుడు మోసం చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి.. ఆ కేటుగాడిని చెరుకూరి హర్షగా గుర్తించారు. ఇలా వివాహ వెబ్‌సైట్లలో వాస్తవాలను నిర్ధారించుకోకుండా యువతీయువకులు గుడ్డిగా ముందుకు వెళ్లడాన్ని పసిగట్టిన సైబర్‌ నేరగాళ్లు తమ దోపిడీకి ఇలాంటి సైట్లనూ అడ్డాగా మార్చుకున్నారు. ఇటీవల ఓ టెకీ నుంచి రూ.7.7 కోట్ల మేర దోచుకున్నారు. బాధితుడిది హైదరాబాద్‌. ఓ వివాహ వెబ్‌సైట్‌ ద్వారా అతడికి ఓ యువతి పరిచయమైంది. ఇద్దరూ ఆ వెబ్‌సైట్‌కు సంబంధించిన ప్రీమియం ప్యాకేజీ సభ్యులు కావడంతో ఒకరి ఫోన్‌ నంబర్లు మరొకరు తెలుసుకుని మాట్లాడుకున్నారు. టెకీని మాటల్లో పెట్టిన యువతి.. ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలొస్తాయని నమ్మించి.. కొన్ని లింకులను పంపించింది. ఆ టెకీ.. కొంత డబ్బు పెట్టుబడిగా పెట్టాడు. తొలుత కేటుగాళ్లు ఆ పెట్టుబడిపై లాభాలు చూపించి.. విత్‌డ్రాకు అవకాశం కల్పించారు. దీంతో ఆ యువకుడు లాభాలపై ఆశతో ఆ సైట్లలో విడతలవారీగా మొత్తమ్మీద రూ.7.7 కోట్ల మేర పెట్టుబడి పెట్టాడు. ఆ డబ్బు, లాభాలు కనిపిస్తున్నా.. డబ్బు విత్‌డ్రా అవ్వకపోవడం, దీనిపై వెబ్‌సైట్ల నిర్వాహకులకు ఫోన్లు చేసినా స్విచాఫ్‌ రావడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు.


సైబర్‌ నేరగాళ్లకు అదే వరమైందా?

వాస్తవానికి మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్లలోని ప్రొఫైల్‌ నిజమైనదేనా? అని నిర్ధారించుకునే వ్యవస్థ నిర్వాహకుల వద్ద ఉండటం లేదు. ఏ దశలోనూ ప్రొఫైల్‌ వెరిఫికేషన్‌ ఫిజికల్‌గా ఉండకపోవడం సైబర్‌ నేరగాళ్లకు వరంగా మారింది. దీనినే ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. యువ వైద్యురాలిని ఫేక్‌ ఫ్రొఫైల్‌తో మోసం చేసిన కేసుకు సంబంధించి హర్షతో పాటు షాదీ డాట్‌ కామ్‌ నిర్వాహకుడు, రిలేషన్‌ షిప్‌ మేనేజర్లపైనా జూబ్లిహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆయా సంస్ధల నిర్వాహకులు ఈ ఏడాది హైకోర్టును ఆశ్రయించారు. తమది కేవలం మధ్యవర్తిత్వంలాంటి వ్యాపారమేనని, ప్రొఫైల్‌ ఫిజికల్‌ వెరిఫికేషన్‌ సాధ్యం కాదని, ఆన్‌లైన్‌ క్రెడెన్షియల్స్‌ మాత్రం చెక్‌ చేస్తామని కోర్టుకు తెలిపారు. అయినా, అయితే.. షాదీ డాట్‌ కామ్‌ నిందితులు జూబ్లిహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి అక్కడి విచారణను ఎదుర్కొవాలని, ఆ తర్వాతే కోర్టుకు రావాలని హైకోర్టు ఆదేశించింది. హర్ష కేసులో బాధితులు, నిందితుడు దేశంలోని వారే కావడంతో పోలీసుల విచారణ సులభమైంది. తాజాగా సైబర్‌ నేరగాళ్లు రంగంలోకి దిగడం, విదేశీ లింకులు ఉండటం, డబ్బు బదిలీ జరిగిన వెంటనే మ్యూల్‌ ఖాతాల ద్వారా నిమిషాల వ్యవధిలో చేతులు మారుతుండటంతో అసలు నిందితులను పట్టుకోవడం కష్టంగా మారుతోందని సైబర్‌ సెక్యూరిటీ అధికారులు అంటున్నారు. వివాహ సంబంధాల వెబ్‌సైట్లలో చొరబడుతున్న చీటర్లు.. నకిలీ ఆన్‌లైన్‌ పెట్టుబడి పఽథకాల్లో డబ్బులు పెట్టాలంటూ ప్రలోభపెడుతున్నారని సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరక్టర్‌ షికాగోయల్‌ తెలిపారు. వైబ్‌సైట్లలోని వివరాలపైనే ఆధారపడొద్దని హెచ్చరించారు..

Updated Date - Oct 11 , 2025 | 09:05 AM