Share News

Cyber Fraud: సైబర్‌ నేరగాళ్ల వలలో టీడీపీ ఎమ్మెల్యే

ABN , Publish Date - Oct 19 , 2025 | 04:13 AM

సైబర్‌ నేరగాళ్ల బారిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ పడ్డారు. ఉగ్రవాదుల బ్యాంకు లావాదేవీలతో ప్రమేయం...

Cyber Fraud: సైబర్‌ నేరగాళ్ల వలలో టీడీపీ ఎమ్మెల్యే

  • 1.07 కోట్లు కాజేసిన కేటుగాళ్లు

  • హైదరాబాద్‌ పోలీసులకు పుట్టా సుధాకర్‌ ఫిర్యాదు

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరగాళ్ల బారిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ పడ్డారు. ఉగ్రవాదుల బ్యాంకు లావాదేవీలతో ప్రమేయం ఉందంటూ మనీ లాండరింగ్‌ పేరు చెప్పి ఎమ్మెల్యేను సైబర్‌ నేరగాళ్ల ముఠా భయపెట్టింది. నకిలీ పత్రాలు చూపిస్తూ ఏక్షణంలోనైనా అరెస్ట్‌ చేస్తామని బెదిరించి రూ. 1.07 కోట్లు కొల్లగొట్టింది. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ నివాసంలో ఉన్నపుడు ఈనెల 10న ఉదయం 7.30 గంటల ప్రాంతంలో 9220373818 నంబర్‌ నుంచి ఆయనకు ఫోన్‌ వచ్చింది. ఫోన్‌ చేసిన వ్యక్తి తాను ముంబై క్రైం బ్రాంచ్‌ అధికారి గౌరవ్‌ శుక్లాగా పరిచయం చేసుకున్నాడు. మనీ లాండరింగ్‌ కేసుల దర్యాప్తులో భాగంగా ఇటీవల అరెస్ట్‌ చేసిన ఉగ్రవాది ఖాతా నుంచి మీ బ్యాంకు ఖాతాకు డబ్బు బదిలీ అయ్యిందని చెప్పి, దానికి సంబంధించి నోటీసులు, సీబీఐ అరెస్ట్‌ వారెంట్‌ అంటూ కొన్ని పత్రాలు చూపాడు. కొద్ది సేపటి తర్వాత మరో నంబర్‌ 7842581950 నుంచి వీడియో కాల్‌ చేసిన నేరగాడు, ముంబై సైబర్‌ క్రైం బ్రాంచ్‌ అధికారి విక్రమ్‌గా పరిచయం చేసుకున్నాడు. ఉగ్రవాది సదాఖాన్‌ ఖాతా నుంచి రూ. 3 కోట్లు మీ బ్యాంకు ఖాతాకు బదిలీ అయ్యాయని, ఈ కేసు విచారణకు ముంబై సైబర్‌ క్రైం కార్యాలయానికి రావాలంటూ భయపెట్టాడు. దర్యాప్తునకు సహకరించకపోతే ఏక్షణంలోనైనా అరెస్ట్‌ చేస్తామంటూ బెదిరించాడు. బ్యాంకు ఖాతాను పరిశీలించాలంటూ పలు దఫాలుగా రూ. 1.07 కోట్లు తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. తర్వాత మరో రూ. 60 లక్షలు డిమాండ్‌ చేశారు. దాంతో మోసపోయానని గ్రహించిన ఎమ్మెల్యే ఇటీవల హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బ్యాంకు ఖాతాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - Oct 19 , 2025 | 04:13 AM