Cyber Crime: అప్పుడు హెచ్చరించారు.. ఇప్పుడు దొరికిపోయారు!
ABN , Publish Date - Oct 02 , 2025 | 04:56 AM
దేశవ్యాప్తంగా అన్ని భాషల సినిమాలనూ పైరసీ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ఆట కట్టించిన హైదరాబాద్ సైబర్..
పోలీసుల అదుపులో ‘ఐబొమ్మ’ పైరసీ నిందితులు
నలుగురిని అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
2023లో ‘ఐబొమ్మ’ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్
హైదరాబాద్, అక్టోబరు 1: దేశవ్యాప్తంగా అన్ని భాషల సినిమాలనూ పైరసీ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ఆట కట్టించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తాజాగా ఓటీటీ కంటెంటే లక్ష్యంగా పైరసీకి పాల్పడుతున్న ఐబొమ్మ వెబ్‌సైట్‌పైనా దృష్టి పెట్టారు. ఆ వెబ్‌సైట్ కోసం పనిచేస్తున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బిహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఐ బొమ్మ కోసం కొందరు ఏజెంట్లు పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేశామని.. త్వరలోనే ఐబొమ్మ ప్రధాన నిర్వాహకుడిని పట్టుకుంటామని మాజీ సీపీ సీవీ ఆనంద్ రెండు రోజుల క్రితం మీడియా సమావేశంలో చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన ప్రకటన నేపథ్యంలో.. ఐబొమ్మ నిర్వాహకులు 2023లో పోలీసులు తమ సైట్‌ను బ్లాక్ చేసిన సందర్భంలో హెచ్చరిస్తూ పెట్టిన పాత పోస్టు ఒకటి తాజాగా వైరల్ అయ్యింది! అది పాతదా కొత్తదా అనే విషయాన్ని నిర్ధారించుకోకుండా.. పలు మీడియా సంస్థలు దానికి విస్తృతంగా ప్రచారం కల్పించాయి. ‘పోలీసులకు ఐబొమ్మ వార్నింగ్’ అంటూ డిజిటల్ మీడియా, టీవీ చానళ్లలో ఆ పాత పోస్టునే ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. ‘‘మాపైన (ఐ బొమ్మ) ఫోకస్ ఆపండి, లేదంటే మీ పైన మేం ఫోకస్ పెట్టాల్సి వస్తుంది. ఐ బొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం. మాతో పెట్టుకోవద్దు’ అంటూ పోలీసు వ్యవస్థనే హెచ్చరిస్తూ పెట్టిన పోస్టు అది. ‘‘కెమెరాల సాయంతో థియేటర్లలో సినిమాలను రికార్డ్ చేసి ప్రింట్స్ విడుదల చేస్తున్న వారిపై మీరు దృష్టి పెట్టండి. మేం ఏ దేశంలో ఉన్నా, భారతదేశం, అందునా తెలుగువారి కోసం ఆలోచిస్తాం. సినిమాలకు అనవ సరంగా భారీ బడ్జెట్ పెట్టి రికవరీ కోసం అధిక ధరలకు ప్రేక్షకులపై రుద్దుతున్నారు. దీనివల్ల మామూలు ప్రేక్షకులు, మధ్య తరగతి ఇబ్బందులు పడుతున్నారు. సినీ కార్మికులకు మీరు ఇచ్చే పారితోషికాలు బయట ఏ కూలీ పనిచేసుకున్నా వస్తాయి. కానీ హీరో హీరోయిన్లకు వస్తాయా? ప్రొడక్షన్ బాయ్స్, లైట్ బాయ్స్‌కు ఎంత ఖర్చవుతుంది?, విదేశాల్లో చిత్రీకరణల కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు? ఇండియాలో షూట్ చేస్తే బడ్జెట్ తగ్గడంతో పాటు స్థానికంగా ఉపాధి కలుగుతుంది. మా వెబ్‌సైట్‌ను బ్లాక్ చేస్తే, మీ ఫోన్ నంబర్లు బయటపెడతాం. ఐదు కోట్ల మంది యూజర్ల సమాచారం మా దగ్గర ఉంది. వెనక్కు తగ్గం. ఇండియా మొత్తం మాకు మద్దతుగా ఉంది. మా సర్వర్లు ఎక్కడున్నాయో పోలీసులకు కనపడవు. మమ్మల్ని వెతకలేరు, ఆపలేరు’’ అని ఆ ప్రకటనలో ఐ బొమ్మ పేర్కొంది.