Kaleshwaram project: కాళేశ్వరం హైడ్రాలిక్ అధ్యయన డేటా ఇవ్వండి
ABN , Publish Date - Sep 10 , 2025 | 04:59 AM
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నమూనా హైడ్రాలిక్ అధ్యయనానికి అవసరమైన..
రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన సీడబ్ల్యూపీఆర్‌ఎస్
హైదరాబాద్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నమూనా హైడ్రాలిక్ అధ్యయనానికి అవసరమైన డేటా అందించాలని తెలంగాణను పుణెలోని కేంద్ర విద్యుత్, నీటి పరిశోధన కేంద్రం (సీడబ్ల్యూపీఆర్‌ఎస్) కోరింది. జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) నివేదికనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీల్లో పరీక్షలు జరిపి నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌సకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంచిర్యాల, టెక్రా, సోమన్‌పల్లి, కాళేశ్వరం, పేరూర్‌ల వద్ద ఉన్న గేజ్ డిశ్చార్జి డేటాను గణిత నమూనాలో విశ్లేషిం చి, అందించాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులకు సీడబ్ల్యూపీఆర్‌ఎస్ లేఖ రాసింది. వరదల తీరు విశ్లేషణకు ఈ డేటా అవసరమని పేర్కొంది. సకాలంలో అత్యంత కీలకమైన ఈ డేటా సమకూరిస్తే సమ గ్ర వివరాలు వెలుగు చూస్తాయని సీడబ్ల్యూపీఆర్‌ఎస్ తేల్చి చెప్పింది.