BV Raghavulu: సాంస్కృతిక వారసత్వమే భారతీయతకు పునాది
ABN , Publish Date - Sep 13 , 2025 | 04:44 AM
హిందూ మత భావన ప్రాచీన కాలం నుంచి ఉందని, ప్రజల రాజకీయ, సామాజిక జీవనాన్ని నడిపించిందని.. సంఘ్ పరివార్ శక్తులు చేస్తున్న...
సంఘ్ పరివార్‌ది అసత్య ప్రచారం: బీవీ రాఘవులు
సీపీఎం ఆధ్వర్యంలో సీతారాం ఏచూరి వర్ధంతి సభ
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): హిందూ మత భావన ప్రాచీన కాలం నుంచి ఉందని, ప్రజల రాజకీయ, సామాజిక జీవనాన్ని నడిపించిందని.. సంఘ్ పరివార్ శక్తులు చేస్తున్న ప్రచారం అసత్యమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. తరతరాల సాంస్కృతిక వారసత్వమే భారతీయ భావనకు పునాది అని పేర్కొన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘సీతారాం ఏచూరి- ఓ సోషలిస్టు ఆచరణ పథం’ పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. ‘భారతీయ భావన - వాస్తవం- వక్రీకరణ’ అంశంపై రాఘవులు కీలకోపన్యాసం చేశారు. భారతీయ భావనకు పునాది మన సమ్మిశ్రమ సాంస్కృతిక వారసత్వంలోనే ఉందని సీతారాం ఏచూరి విశ్వసించారని పేర్కొన్నారు. బీజేపీ, ఆరెస్సె్‌సలకు ప్రజాస్వామ్యం నచ్చదని, భూస్వామ్య, రాచరిక వ్యవస్థలను తిరిగి తేవాలన్నదే మతతత్వ సమూహాల లక్ష్యమని ఆయన ఆరోపించారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ బీజేపీకి కాంగ్రెస్ రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని, మతోన్మాదాన్ని సైద్ధాంతికంగా ఓడించగలిగేది వామపక్ష పార్టీలేనని పేర్కొన్నారు. సోషలిస్టు యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ మురహరి మాట్లాడుతూ జాతుల ఏర్పాటులో మతానికి ప్రాధాన్యం లేదని అభిప్రాయపడ్డారు.