Share News

సాగు పనులు షురూ

ABN , Publish Date - May 31 , 2025 | 12:43 AM

ఈ ఏడాది వానాకాలం సీజనకు ముందే వర్షాలు కురుస్తుండటంతో దేవరకొండ డివిజన పరిధిలోని రైతులు దుక్కులు దున్నుకొని విత్తనాలు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

 సాగు పనులు షురూ
వర్షాలు కురియడంతో చందంపేట మండలంలో దుక్కులు దున్నుకుంటున్న రైతులు

సాగు పనులు షురూ

కురుస్తున్న వర్షాలకు అన్నదాతల హర్షం

డివిజనలో దుక్కులు దున్నకం

విత్తనాలు విత్తేందుకు సిద్ధం చేస్తున్న రైతులు

2.25 లక్షల ఎకరాల సాగుకు ప్రణాళికలు

విత్తనాలు సిద్ధం చేసిన వ్యవసాయశాఖ అధికారులు

దేవరకొండ, మే 30 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది వానాకాలం సీజనకు ముందే వర్షాలు కురుస్తుండటంతో దేవరకొండ డివిజన పరిధిలోని రైతులు దుక్కులు దున్నుకొని విత్తనాలు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. దేవరకొండ వ్యవసాయ డివిజనలో 2.25 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. గతేడాది 2 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలను సాగు చేశారు. ఈ సంవత్సరం 1.74 లక్షల ఎకరాల్లో పత్తి, 40 వేల ఎకరాల్లో వరి, ఇతర పంటలను వేసేందుకు సిద్ధమవుతున్నారు. రైతులకు సరిపడా పత్తి విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. డివిజనలో అత్యధికంగా రైతులు పత్తి పంటపైనే సాగుకు మొగ్గు చూపుతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు గ్రామసభలు నిర్వహించి గ్రామాల్లో రైతులతో సమావేశాలు నిర్వహించి వేరుశనగ, మొక్కజొన్న, మినుములు, నువ్వులు, కుసుమలు, ఇతర వాణిజ్య పంటలు వేసుకొని అధిక దిగుబడి సాధించుకోవాలని సూచనలు, సలహాలు ఇస్తున్నారు. గత సంవత్సరం కూడా రైతులు డివిజనలో అత్యధికంగా పత్తి పంటను సాగు చేశారు. దీంతో పాటు మిరప, వేరుశనగ పంటలను వేశారు. ఏఎమ్మార్పీ, డిండి ప్రాజెక్టుల కింద వరి పంటను సాగు చేశారు. ఈ ఏడాది ముందస్తుగానే వర్షాలు కురుస్తుండటంతో దుక్కులు దున్నుకొని భారీ వర్షం కురిస్తే విత్తనాలు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. రైతులకు సరిపడా పత్తి విత్తనాలు 3 లక్షల ప్యాకెట్లకు పైగా లైసెన్స కలిగిన దుకాణాల్లో సిద్ధంగా ఉన్నాయని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

నకిలీ విత్తనాలపై నిఘా

ఈ సీజనలో రైతులకు సరిపడా పత్తి విత్తనాలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. నకిలీ విత్తనాలపై నిఘా ఏర్పాటు చేశాం. రైతులు దుకాణాల్లో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి రశీదు తీసుకోవాలి. వ్యవసాయశాఖ అధికారుల సలహాలు, సూచనలు తీసుకొని అధిక పంట దిగుబడి సాధించుకోవాలి. వరి, పత్తితో పాటు వా ణిజ్య పంటలైన నువ్వులు, వేరుశనగ, మొ క్కజొన్న, మిరప, ఇతర పంటలను కూడా సాగు చేసుకోవాలి.

- శ్రీలక్ష్మీ, ఏడీఏ, దేవరకొండ

Updated Date - May 31 , 2025 | 12:44 AM