యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ
ABN , Publish Date - Jun 16 , 2025 | 12:35 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం భక్తులతో కోలాహలంగా మారింది.
78వేల మంది భక్తులు రాక
నిత్యాదాయం రూ.80.11 లక్షలు
యాదగిరిగుట్ట, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం భక్తులతో కోలాహలంగా మారింది. ఆదివారం వారాంతపు సెలవు కావడంతో ఇష్టదైవాలను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 78వేల మంది భక్తులు క్షేత్ర దర్శనానికి తరలివచ్చారు. ప్రత్యేక, ఉచిత ధర్మదర్శన క్యూకాంప్లెక్స్, క్యూలైన్లు భక్తులతో ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీ కొనసాగింది. ప్రత్యేక దర్శనాలకు రెండు గంటలు, ధర్మదర్శనాలకు నాలుగు గంటల సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ. 80,11,461 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఎస్. వెంకట్రావు తెలిపారు.
శాస్త్రోక్తంగా నిత్య పూజలు
సుప్రభాత సేవతో స్వామి అమ్మవారిని మేల్కొలిపిన అర్చకులు సంప్రదాయరీతిలో నిత్యపూజలు నిర్వహించారు. గర్భాలయంలో స్వయంభువులకు అభిషేకం, అర్చనలు, ప్రాకార మండపంలో హోమం, నిత్య కల్యాణోత్సవ పర్వాలు వైభవంగా చేపట్టారు. అదేవిధంగా పాతగుట్టలో స్వామిఅమ్మవారికి నిత్య పూజలు చేపట్టారు. శివాలయంలో పర్వతవర్థిని సమేత రామలింగేశ్వర స్వామివారికి నిత్య పూజలు, రుద్రహవన పూజలు, శైవాగమరీతిలో జరిపారు. రాత్రి మహానివేదన, శయనోత్సవాలతో ఆలయ ద్వారబంధనం చేశారు. లక్ష్మీనృసింహుడిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీ.వీ భాస్కర్‌రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. గర్భాలయంలోని స్వయంభువులకు ప్రత్యేక పూజలు చేశారు. మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
భక్తుల ప్రసాద వితరణకు..
భక్తుల ప్రసాద వితరణకు దేవాదాయ కమిషనర్, ఈవో ఎస్. వెంకట్రావు రూ.3లక్షల విరాళం అందజేశారు. కొండపైన ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఈవో దంపతులు రూ.3లక్షల చెక్కును అనువంశిక ధర్మకర్త భాస్కరాయణి నరసింహమూర్తి, డీఈవో దోర్భల భాస్కరశర్మకు అందజేసి మాట్లాడారు. స్వామివారి భక్తులకు ఉచిత ప్రసాద వితరణ నిమిత్తం తాను సర్వీసులో ఉన్నంత కాలం తన వేతనం నుంచి ప్రతి నెల రూ.లక్ష చెల్లిస్తానని తెలిపారు. తాను అందజేసిన విరాళంతో ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన క్షేత్ర సందర్శనకు వచ్చే భక్తులకు ప్రసాద వితరణ చేయాలన్నారు. తన కుమారుడు దేవజ్‌కుమార్, కుమార్తె మోనిషా కూడా చెరో రూ.లక్ష విరాళం ఇచ్చారని, మొత్తం కలిపి రూ. 3లక్షలు విరాళం ఇచ్చానన్నారు.
వైభవంగా లక్ష్మీనరసింహుడి కల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీ నృసింహుడి క్షేత్రంలో ఆదివారం శ్రీరాజలక్ష్మీ, చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నరసింహుడి నిత్యకల్యాణాన్ని వేదపండితులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవారు రాజలక్ష్మీ, చెంచులక్ష్మీ సమేత భక్తవత్సలుడికి నిజాభిషేకం, నిత్యార్చనలు చేశారు. తర్వాత ఆలయ సంప్రదాయ ప్రకారం ఆర్జిత కైంకర్యాలు జరిగాయి. ఉదయం హోమాధికాల భక్తిశ్రద్ధలతో చేశారు. తదుపరి కల్యాణ మూర్తులను పరిణయోత్సవ వేదికపైకి వేంచేయించి పుణ్యాహవాచనం చేశారు. పాదప్రక్షాళనం మధుపర్క పూజలు చేపట్టారు. అనంతరం మాంగళ్యధారణ, యజ్ఘోపవీత ధారణల అనంతరం దివ్యమూర్తులకు గరుడోత్సవం జరిగింది. మధ్యాహ్నం అమ్మవారికి కుంకుమార్చన, విశేషపర్వాలు నిర్వహించారు. వేదపండితులు తూమాటి రామాచార్యులు, బదరీనారాయణచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి కల్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈవో సిరికొండ నవీన్, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.