Critical Maoist Data Destroyed: మావోయిస్టుల కీలక డేటా ధ్వంసం!
ABN , Publish Date - Nov 02 , 2025 | 04:47 AM
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మావోయిస్టులకు సంబంధించిన కీలక డేటా కూడా ధ్వంసమైందా...
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపైబీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్
అందుకే సీబీఐ విచారణకు రాష్ట్ర నేతల డిమాండ్
ప్రభాకర్‌రావు కేసులో సుప్రీంకోర్టులో ఇంప్లీడ్
ఆనాటి ఎస్‌ఐబీ ధ్వంసం చేసిన ట్యాపింగ్ డేటాలోనే మావోయిస్టుల సమాచారం!
ఎఫ్‌ఎ్‌సఎల్ నివేదికలో కీలక అంశాలు!?
బీజేపీ హైకమాండ్ వద్ద సమగ్ర నివేదిక!
రాష్ట్ర రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలు?
హైదరాబాద్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మావోయిస్టులకు సంబంధించిన కీలక డేటా కూడా ధ్వంసమైందా? ఈ అంశాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం అత్యంత సీరియ్‌సగా తీసుకుందా? రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలకు ఫోన్ ట్యాపింగ్ కేసు కారణం కాబోతోందా? ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేయడానికి ఇదే కారణమా? అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా దేశవ్యాప్తంగా మావోయిస్టుల కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే. ఈ దిశగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తెలంగాణలో చోటుచేసుకున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మావోయిస్టులకు సంబంధించిన సమాచారం కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ధ్వంసం కావడాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇందులో భాగంగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేసులో బీజేపీ ఇంప్లీడ్ అయిందని ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎ్‌సఎల్) సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్‌లో నివేదిక ఇచ్చింది. దాదాపు 15 రోజుల కిందట ఈ నివేదికను సుప్రీంకు నివేదించినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఆ నివేదికలో ఏముందన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.
బీజేపీ హైకమాండ్ వద్ద సమగ్ర నివేదిక !
తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సమగ్ర సమాచారం బీజేపీ జాతీయ నాయకత్వం వద్ద ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ పార్టీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. అధినాయకత్వానికి చేరిన ఎఫ్‌ఎ్‌సఎల్ నివేదికలో పలు కీలక అంశాలను పేర్కొన్నారు. అందులో, ‘‘మావోయిస్టుల పేర్లతో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రముఖులు, జడ్జిలు, సినీతారలు, వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతోపాటు ఆనాటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ కేంద్ర పార్టీ నాయకత్వంతో మాట్లాడిన అంశాలను కూడా ఎస్‌ఐబీ అధికారులు ట్యాప్ చేశారు. ఈ ట్యాపింగ్ ద్వారానే గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఒక అభ్యర్థికి సంబంధించి రూ.7 కోట్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు అభ్యర్థులను, సినీ తారలను బెదిరించి వందల కోట్లు వసూలు చేశారు. ఆ డబ్బును అప్పటి ప్రభుత్వ పెద్దలు, హవాలా ద్వారా విదేశాలకూ తరలించినట్లు ఆరోపణలున్నాయి. మరోవైపు, రిటైర్ అయిన ప్రభాకర్‌రావును ఎస్‌ఐబీ చీఫ్‌గా అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం నియమించడం వెనుకా భారీ స్కెచ్ ఉంది. కేంద్ర హోంశాఖ నిబంధనలకు విరుద్ధంగా ఆయన నియామకం జరిగింది. ఎన్నికల సర్వేలతోపాటు ఫలితాలు వెలువడే సమయంలో బీఆర్‌ఎస్ అధికారం కోల్పోతోందని నిర్ధారణ కావడంతో ఎస్‌ఐబీ తన వద్ద ఉన్న డేటాను ధ్వంసం చేసింది. ఇందులో మావోయిస్టులకు సంబంధించిన కీలక డేటాఉంది’’ అని నివేదికలో పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు వివరించాయి.
ఆ రెండు పార్టీలకు చెక్ పెట్టడమే లక్ష్యం..
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెక్ పెట్టే లక్ష్యంతో తమ పార్టీ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని బీజేపీ కీలక నేత ఒకరు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే హైకోర్టులో బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు దర్యాప్తునకు సిట్ పరిధి సరిపోదని, ఇది జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలతో కూడా ముడిపడి ఉందని పిటిషన్‌లో పేర్కొంది. అంతేకాకుండా.. సుప్రీంకోర్టులో కొనసాగుతున్న ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్ రద్దు కేసును నిన్నమొన్నటి దాకా పట్టించుకోని తమ పార్టీ జాతీయ నాయకత్వం.. ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని కోరుతూ తాజాగా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయడం ఇందులో భాగమేనని బీజేపీ కీలక నేత వివరించారు. పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఎదుట గత ఆగస్టు 8న బండి సంజయ్ హాజరైన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు కూడా సీబీఐ దర్యాప్తు కోరాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.