Medigadda Barrage Failure: ఎల్‌అండ్ టీ పై క్రిమినల్ కేసు!
ABN , Publish Date - Dec 20 , 2025 | 05:13 AM
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీయే కారణమని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది..
మేడిగడ్డ పునరుద్ధరణ బాధ్యతలో వైఫల్యమే కారణం
క్రిమినల్ కేసు పెట్టడానికి న్యాయశాఖ అంగీకారం.. తొలుత షోకాజ్.. స్పందించకుంటే చర్యలు
హైదరాబాద్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీయే కారణమని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. సొంత నిధులతో బ్యారేజీ పునరుద్ధరణకు కంపెనీ బాధ్యత తీసుకోకపోతే క్రిమినల్ కేసు పెట్టాలని నిర్ణయించింది. క్రిమినల్ కేసు విషయంలో న్యాయశాఖ సలహా కోరగా గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఎల్ అండ్ టీపై క్రిమినల్ కేసు పెట్టి, బ్యారేజీ పునరుద్ధరణకు అయ్యే వ్యయాన్ని సంస్థ రాబట్టుకోవాలని కాళేశ్వరం బ్యారేజీలపై విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. బ్యారేజీల మరమ్మతు వ్యయం అంతా నిర్మాణ సంస్థలే భరించాలని, వాటి ద్వారానే మరమ్మతులు జరగాలని సీఎం రేవంత్‌రెడ్డి, నీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులు ఇప్పటికే మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి, అన్నారం నిర్మాణ సంస్థ అఫ్కాన్స్‌కు, సుందిళ్ల నిర్మాణ సంస్థ నవయుగకు నోటీసులు ఇచ్చారు. వాటి నుంచి నిరాశాజనకంగా సమాధానం రావడంతో కఠిన చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే షోకాజు నోటీసులు ఇవ్వనున్నారు. వాటి స్పందనను బట్టి క్రిమినల్ కేసుపై నిర్ణయం ఉంటుంది.
పూర్తయిన సంవత్సరంలోనే లోపాలు
2019 మే నెలలో మేడిగడ్డ బ్యారేజీని అప్పటి ముఖ్యమంత్రి ప్రారంభించారు. అదే సంవత్సరం నవంబరులో వరదల అనంతరం గేట్లు మూయగా బ్యారేజీ దిగువభాగంలో రక్షణ వ్యవస్థలన్నీ చెల్లాచెదురు అయ్యాయి. 2020 ఫిబ్రవరి, 2020 మే నెలలో కూడా బ్యారేజీలో రక్షణ వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయి. ఐదు సార్లు నోటీసులు ఇచ్చినా దెబ్బతిన్న బ్యారేజీలోని కాంపోనెంట్లను నిర్మాణ సంస్థ సరి చేయలేదని ప్రభుత్వం గుర్తించింది. మరమ్మతులు చేయకుండా ఎల్ అండ్ టీ ఉద్దేశ పూర్వకంగా ఒప్పందంలోని నిబంధనలను అతిక్రమించిందని ప్రభుత్వం భావిస్తోంది. బ్యారేజీ నిర్మాణం పూర్తయిన నాటి నుంచి రెండేళ్ల లోపు లోపాలు ఉంటే సవరించడం, మరమ్మతులు చేసే బాధ్యత కంపెనీదే. 2019, 2020లలోనే లోపాలు బయటపడ్డా సరిచేయలేదు. 2023 అక్టోబరు 21న ఏడో బ్లాక్ కుంగినపుడు మర్నాడు ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన సమావేశంలో బ్యారే జీ మరమ్మతులు తామే భరిస్తామని ఎల్ అండ్ టీ ప్రతినిధి సురేష్ కుమార్ ప్రకటన కూడా చేశారు.