Share News

DGP Shivadher Reddy: తగ్గిన నేరాలు.. పెరిగిన రోడ్డు ప్రమాదాలు

ABN , Publish Date - Dec 31 , 2025 | 05:24 AM

రాష్ట్రంలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాలు 2.33 శాతం తగ్గాయని డీజీపీ శివధర్‌రెడ్డి చెప్పారు. శాంతిభద్రతల పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు.

DGP Shivadher Reddy: తగ్గిన నేరాలు.. పెరిగిన రోడ్డు ప్రమాదాలు

  • మరణాలు, క్షతగాత్రుల సంఖ్య తగ్గింది రాష్ట్రంలో సైబర్‌ నేరాలూ భారీగా తగ్గాయి

  • దొమ్మీలు, కొట్లాటలు 47 శాతం తగ్గుముఖం

  • డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపడంతో కేసులు పెరిగాయ్‌

  • 2025 తెలంగాణ నేర వార్షిక నివేదిక విడుదల

  • దేశంలో పలు అంశాల్లో రాష్ట్ర పోలీసులే బెస్ట్‌: డీజీపీ

హైదరాబాద్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాలు 2.33 శాతం తగ్గాయని డీజీపీ శివధర్‌రెడ్డి చెప్పారు. శాంతిభద్రతల పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. సైబర్‌ నేరాల్లో కూడా గణనీయమైన తగ్గుదల నమోదైందని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో స్వల్ప (5.68ు) పెరుగుదల ఉన్నప్పటికీ, వాటి వల్ల మరణించిన, గాయపడిన వారి సంఖ్య తగ్గిందని ఆయన వివరించారు. మంగళవారం డీజీపీ తన కార్యాలయంలో సీనియర్‌ పోలీసు అధికారులతో కలిసి తెలంగాణ నేర వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల్లో మరణాలు 8ు తగ్గాయని, క్షతగాత్రుల సంఖ్యలో 32 శాతం తగ్గుదల ఉందని, ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు వేగంగా స్పందించడం వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. గత ఐదేళ్లతో పోలిస్తే దొమ్మీలు, కొట్లాటలు 47ు తగ్గాయని, ఇది పోలీసుల పనితీరుకు నిదర్శనమని చెప్పారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో అల్లర్లు, దొమ్మీలు జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో 2,28,695 క్రిమినల్‌ కేసులు నమోదవగా.. గత ఏడాది ఈ సంఖ్య 2,34,158గా ఉందన్నారు. కేసులు 2.33 శాతం తగ్గాయని వివరించారు. తెలంగాణలో ఈ ఏడాది 1,67,018 ఐపీసీ (బీఎన్‌ఎ్‌స) కేసులు నమోదు కాగా, గత ఏడాది 1,69,477 కేసులు నమోదయ్యాయని ఈ కేసులు కూడా 1.45ు తగ్గాయని తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాది మొత్తం ఐదు లోక్‌ అదాలత్‌లు జరిగాయని.. వీటిలో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న 7,22,487 కేసులను పరిష్కరించామని చెప్పా రు. లోక్‌ అదాలత్‌ల ద్వారా కేసుల పరిష్కారంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా పలు అంశాల్లో రాష్ట్ర పోలీసులే అగ్రస్థానంలో నిలిచారన్నారు. రాష్ట్రంలో 509 మంది మావోయిస్టులు లొంగిపోయారని, వీరిలో 483 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారని, 26 మందే తెలంగాణ వారని వివరించారు. దేశవ్యాప్తంగా సైబ ర్‌ క్రైం కేసుల్లో 41ు పెరుగుదల ఉంటే తెలంగాణలో 3ు తగ్గుదల ఉందని చెప్పారు. సైబర్‌ నేరాల వల్ల జరిగిన ఆర్థిక నష్టంలో దేశవ్యాప్తంగా 6 శాతం తగ్గుదల ఉండగా.. తెలంగాణలో దాన్ని 21 శాతానికి తగ్గించగలిగామని డీజీపీ వివరించారు. ఇక శిక్షల శాతం గత ఏడాదితో పోలిస్తే 3ు పెరిగిందన్నారు. ఈ ఏడాది 22,882 మిస్సింగ్‌ కేసులు నమోదవగా.. 21,754 మందిని కాపాడామని, ఇంకా 3,320 మంది ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు.


మత్తు వదిలిస్తున్నాం..

మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్న నేపఽథ్యంలో కేసుల సంఖ్య పెరిగిందని డీజీపీ శివధర్‌రెడ్డి చెప్పారు. ఈగల్‌ పోలీసులు ఇతర రాష్ట్రాల్లో సైతం ఆపరేషన్లు నిర్వహించి మత్తుమందుల సరఫరా నెట్‌వర్క్‌ను ధ్వంసం చేస్తున్నారని తెలిపారు. గత ఏడాది మత్తుమందుల అక్రమ రవాణాకు సం బంధించి 2,169 కేసులు నమోదు చేసి రూ.139 కోట్ల డ్రగ్స్‌ను సీజ్‌ చేశామని చెప్పారు. ఈ ఏడాది 2,542 కేసులు నమోదు చేసి రూ.173 కోట్ల మత్తుమందులను స్వాధీనం చేసుకున్నామన్నారు. డ్రగ్స్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోకు సంబంధించి గత ఏడాది రూ.200 కోట్ల సొత్తు రికవరీ చేయగా, ఈ ఏడాది రూ.246 కోట్ల సొత్తు రాబట్టి.. కోర్టుల ద్వారా 24,498 మంది బాధితులకు రూ.160 కోట్లు తిరిగి ఇచ్చామని తెలిపారు. ఆన్‌లైన్‌లో చిన్నారుల అశ్లీల చిత్రాలను చూడడం, డౌన్‌లోడ్‌ చేయడం, షేర్‌ చే యడం నేరమని.. ఇలాంటి నేరాల్లో 854 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి 376 మందిని అరెస్టు చేసినట్లు వివరించారు.

మా లెక్కలు పక్కాగా ఉంటాయ్‌

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిందన్న మాజీ సీఎం కేసీఆర్‌ ఆరోపణలపై శివధర్‌రెడ్డి స్పందిస్తూ.. పోలీసు లెక్కలన్నీ పేపర్‌పై ఉంటాయని, కల్పిత లెక్కలు ఉండవని చెప్పారు. దొమ్మీల్లో 42.9 శాతం తగ్గుదల కనిపిస్తే శాంతిభద్రతల పరిస్థితి ఎంత మెరుగ్గా ఉందనే విషయం స్పష్టమవుతుందని పేర్కొన్నారు. నయీం కేసులు కోర్టుల పరిధికి చేరిన తర్వాత కొందరు ఆ ఆస్తులను విక్రయిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయన్నారు. విషయాన్ని న్యాయస్ధానం దృష్టికి తీసుకెళ్లగా, ఆ ఆస్తులన్నింటినీ నిషేధిత జాబితాలో పెట్టాలని ఆదేశాలిచ్చిందని చెప్పారు.


పోలీసుల్లో ఆత్మహత్యల నివారణకు కౌన్సెలింగ్‌

ఇటీవల కొంతకాలంగా పోలీసు శాఖలో వివిధ హోదాల్లో ఉన్నవారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, దీన్ని నివారించడానికి సమగ్ర ప్రణాళిక రూపొందించామని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. ప్రతి ఇన్‌స్పెక్టర్‌ మూడు నెలలకోసారి తమ సిబ్బంది పనితీరును పరిశీలించి, ఎవరైనా ఒత్తిడికి గురైనట్లు గుర్తిస్తే వారికి కౌన్సెలింగ్‌ ఇప్పించి, అవసరమైన సెలవులు మంజూరు చేయాలని ఆదేశించామని చెప్పారు. బెట్టింగ్‌ యాప్‌ల వల్ల సామన్యులే కాదు పోలీసులూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారని.. ఇది దేశవ్యాప్త సమస్య అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో లాక్‌పలో సీసీ కెమెరాల ఏర్పాటు తుది దశకు చేరిందన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణ పారదర్శకంగా సాగుతోందని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నందున దీనిపై ఎక్కువ మాట్లాడలేనని శివధర్‌రెడ్డి చెప్పారు.

Updated Date - Dec 31 , 2025 | 05:24 AM