kumaram bheem asifabad- గత ఏడాదితో పోలిస్తే నేరాలు పెరిగాయి
ABN , Publish Date - Dec 29 , 2025 | 11:17 PM
జిల్లాలో పోలీసుల తనిఖీలు పెద్ద ఎత్తున పెరిగాయని దీంతో 2024తో పోలిస్తే 2025లో నేరాల సంఖ్య పెరిగిందని జిల్లా ఎస్పీ నితికా పంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీపీవో కార్యాలయంలో సోమవారం కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దీన్‌తో కలిసి వార్షిక నేర నివేదికను విడుదల చేశారు.
ఆసిఫాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పోలీసుల తనిఖీలు పెద్ద ఎత్తున పెరిగాయని దీంతో 2024తో పోలిస్తే 2025లో నేరాల సంఖ్య పెరిగిందని జిల్లా ఎస్పీ నితికా పంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీపీవో కార్యాలయంలో సోమవారం కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దీన్‌తో కలిసి వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సాధారణ నేరాల సంఖ్య 2024లో 1207 ఉండగా ప్రస్తుత సంవత్సరంలో 1,934కి పెరిగాయని చెప్పారు. పెరుగుదల రేటు 60.23 శాతం ఉందన్నారు. నేరాలు పెరగడానికి పోలీసుల తనిఖీలతో పాటు నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్, వరకట్న ఇతర గృహ వేధింపులు కారణమని గుర్తించామన్నారు. నేరాల నియంత్రణ కోసం అవగాహన కల్పించేందుకు కళాబృందాల ద్వారా 151 కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. ప్రజల ద్వారా నేరుగా ప్రతి సోమవారం గ్రీవెన్స్‌సెల్ ద్వారా 232 దరఖా స్తులు స్వీకరించి అందులో 220 పరిష్కరించామని తెలిపారు. వాహనాల తనిఖీల్లో 3,757 డ్రంకెన్‌డ్రైవ్ కేసులను నమోదు చేసినట్లు తెలిపారు. వీటి ద్వారా రూ. 1,04,526 లు వసూలు చేశామన్నారు. నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ వల్ల జిల్లాలో 267 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కింద 38 కేసులు నమోదయ్యయన్నారు. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దే లక్ష్యంగా పెద్ద ఎత్తున దాడులు నిర్వహించి 73 కేసులు నమోదు చేసి 122 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. మహిళలపై గృహహింసలు, హత్యలు, అత్యాచార కేసులు గత సంవత్సరం 99 ఉన్నాయని అన్నారు. ప్రసుత్తం ఆ సంఖ్య 106కు చేరిందన్నారు. లోక్ అదాలత్‌ల ద్వారా 4,118 కేసులు పరిష్కరించామని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసుశాఖ ముందుకు వెళుతుందన్నారు. ప్రజలు పోలీసుశాఖకు సహకరించాలని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యత యుతంగా వ్యవహరించాలన్నారు. భవిష్యత్‌లో కూడ నేరాల నివారణకు కఠిన చర్యలు తీసుకుం టామని చెప్పారు. ప్రజల భద్రతే పోలీసుశాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సమావే శంలో జిల్లాలోని సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.