Share News

Mandakrisna Madiga urged: చీఫ్‌ జస్టిస్‌పై దాడికి..పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి

ABN , Publish Date - Oct 09 , 2025 | 05:16 AM

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు...

Mandakrisna Madiga urged: చీఫ్‌ జస్టిస్‌పై దాడికి..పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి

  • లోతైన దర్యాప్తు జరిపించాలి: మందకృష్ణ

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి) : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. దేశంలోని ప్రతీ ఒక్కరు ఈ దాడిని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారన్నారు. చీఫ్‌ జస్టి్‌సపై సుప్రీంకోర్టులోనే జరిగిన అమానుష దాడికి నిరసనగా బుధవారం మల్కాజిగిరి చౌరస్తాలో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ.. ప్రధాన న్యాయమూర్తిపైనే దాడి చేయడం అంటే దేశ ప్రజాస్వామ్య హృదయాన్ని గాయపర్చడమేనని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు గుంటి లక్ష్మణ్‌, కృపాసాగర్‌, విజయ్‌కుమార్‌, శ్రీనివాస్‌, మంగ, సూర్యకుమార్‌, ప్రదీ్‌పదాస్‌ గుప్తా, మురళీమోహన్‌ తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని సత్వరమే ఖండించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నామని, అయితే.. ఈ దాడిపై మరింత లోతుగా దర్యాప్తు జరిపించాలని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. జస్టిస్‌ గవాయ్‌పై జరిగిన దాడికి నిరసనగా ఈ నెల 9వ తేదీ నుంచి పది రోజుల పాటు ఉద్యమం నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. సికిందాబాద్‌లోని గాయత్రి గార్డెన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ దాడిని పోలీసు యంత్రాంగం, న్యాయవ్యవస్థ సుమోటోగా తీసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని అభిప్రాయపడ్డారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని తెలంగాణ సచివాలయ ఉద్యోగులు ఖండించారు. సచివాలయం ఆవరణలో బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి బాహుబలి గేటు వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సచివాలయ అధికారుల సంఘం అధ్యక్షుడు జి. సురేష్‌ కుమార్‌, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రశాంత్‌ కుమార్‌, సచివాలయ సంఘం ప్రధాన కార్యదర్శి ప్రేమ్‌ తదితరులు మాట్లాడారు. ఇది ప్రజాస్వామ్యంపైన, లౌకికవాదులపైన జరిగిన దాడిగా అభివర్ణించారు.

Updated Date - Oct 09 , 2025 | 05:16 AM