CPI Calls for Unity in Khammam: ఖమ్మం జిల్లా.. కమ్యూనిస్టుల ఖిల్లా
ABN , Publish Date - Nov 22 , 2025 | 05:14 AM
ఉమ్మడి ఖమ్మం జిల్లా కమ్యూనిస్టుల ఖిల్లా అని, కమ్యూనిస్టుల ఐక్యతతో మత ఛాందసవాదాన్ని నిలువరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు...
సీపీఐ శతాబ్ది ఉత్సవాలు ప్రజా పోరాటాలకు స్ఫూర్తి .. కమ్యూనిస్టుల ఐక్యతతోనే బీజేపీ ఆగడాలకు అడ్డుకట్ట
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
మావోల్లారా.. మాతృ సంస్థసీపీఐలో సమీకృతం కండి:చాడ
కొత్తగూడెం టౌన్/ఇల్లెందు, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఖమ్మం జిల్లా కమ్యూనిస్టుల ఖిల్లా అని, కమ్యూనిస్టుల ఐక్యతతో మత ఛాందసవాదాన్ని నిలువరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్రకార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు. సీపీఐ శతవసంత ఉత్సవాలను పురస్కరించుకుని 15న గద్వాల జిల్లా కేంద్రం నుంచి ప్రారంభమైన ప్రచారయాత్ర శుక్రవారం రాత్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్ (పోస్టాఫీస్ సెంటర్) కు చేరుకుంది. ఈ సందర్భంగా సీపీఐ శ్రేణులు విప్లవ గీతాలతో ఘనస్వాగతం పలికారు. ఆనంతరం కూనంనేని, నెల్లికంటి సత్యం మాట్లాడు తూ.. దేశంలో నూరేళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏకైక పార్టీ సీపీఐ అని కొనియాడారు. స్వాతంత్య్ర సమరంలో బ్రిటీష్ సామ్రాజ్యవాదుల నుంచి అలుపెరగని పోరాటాల్లో కీలక పాత్ర పోషించిందని, సీపీఐ పోరాటాలను, త్యాగాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సహజవనరులకు నిలయమైన జిల్లాలో అటవీ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేందుకు అపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులను బూటకపు ఎన్‌కౌంటర్లు చేస్తోందని ఆరోపించారు. ‘రాష్ట్రాన్ని కాపాడండి.. దేశానికి రక్షణ కల్పించాలి’ అన్న నినాదంతో సీపీఐ ఆధ్వర్యంలో డిసెంబరు 26న ఖమ్మంలో జరగనున్న భారీ బహిరంగ సభను ఐదు లక్షల మందితో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాగా ఎర్రజెం డాలంటే కేంద్రప్రభుత్వం వణికిపోతోందని, తమ దోపిడీ సంస్థలకు ఆదివాసీ సంపదలు కట్టబెట్టడానికే మావోయిస్టులను అమానుషంగా కాల్చి చంపుతోందని సీపీఐ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం సీపీఐ శత వసంతాల ముగింపు ప్రచారంలో భాగంగా ఇల్లెందు పాత బస్టాండ్ సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీలను, వారికి అండగా ఉన్న మావోయిస్టులను బూటకపు ఎన్ కౌంటర్ల పేరిట హత్యలు చేస్తున్నారని విమర్శించారు. లొంగిపోయిన మావోయిస్టులకు సీపీఐ అండగా ఉంటుందన్నారు. సీపీఐ నాయకత్వంలో పోరాటాలకు ఎర్ర జెండాల మాతృ సంస్ధ సీపీఐలో సమీకృతం కావాలని పిలుపునిచ్చారు. ఎర్రజెండాల ఐక్యతతోనే కేంద్రం ఫాసిస్టు శక్తులకు అడ్డుకట్ట పడుతుందన్నారు. వరవరరావు, సాయిబాబా వంటి మేధావులపై అర్బన్ నక్సలైట్ల ముద్ర వేసి అక్రమ నిర్బంధాలకు కేంద్రం పూనుకొందన్నారు. చివరకు సుప్రీంకోర్టు సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించిందన్నారు. మేధావులను ప్రశ్నించే వారిని అక్రమ నిర్బంఽధాలకు గురిచేస్తూ ఎన్‌కౌంటర్ల పేరిట అమానుషంగా హత్యలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న ఫాసిస్టు చర్యలను నిరసించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.