Co Working Spaces: వర్క్ ఫ్రం రైల్వేస్టేషన్!
ABN , Publish Date - Dec 27 , 2025 | 04:45 AM
హడావుడిగా వేరే ఊరికి బయల్దేరారు.. రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు.. రైలు రావడానికి మరో గంట సమయం ఉంది..
సికింద్రాబాద్ స్టేషన్‌లో ‘స్మార్ట్’ సౌకర్యాలు
అందుబాటులోకి డిజిటల్ లాంజ్, కో-వర్కింగ్ స్పేస్.. ఆఫీసు తరహా వాతావరణం, హైస్పీడ్ వైఫై
వీడియో కాన్ఫరెన్సింగ్, ప్రింటింగ్, స్కానింగ్ సదుపాయాలు
సాంకేతికత, సౌకర్యాలను ఒకేచోట అందించేలా రూపకల్పన
రైలు కోసం వేచి ఉండే సమయంలోనే పనిచేసుకునే అవకాశం
ఐటీ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులకు ప్రయోజనం
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): హడావుడిగా వేరే ఊరికి బయల్దేరారు.. రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు.. రైలు రావడానికి మరో గంట సమయం ఉంది.. మరోవైపు ఆఫీసుకు సంబంధించిన పని పెండింగ్‌లో ఉంది.. మరెలా.. సింపుల్‌గా స్టేషన్‌లోని కో-వర్కింగ్ స్పేస్‌కు వెళ్లారు. ఆఫీసు తరహాలో సకల ఏర్పాట్లతో ఉన్న ఓ టేబుల్‌పై ల్యాప్‌టాప్ పెట్టుకుని, పని పూర్తి చేసుకున్నారు.. రైలు రాగానే వెళ్లి ఊరికి వెళ్లిపోయారు.. ఇదేదో బాగుంది కదా..! ‘స్మార్ట్’గా మారుతున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో అందుబాటులోకి వస్తు న్న సౌకర్యమిది. సాంకేతికతను, సౌకర్యాలను ఒకే వేదికపై అందించేలా డిజిటల్ లాంజ్, కో-వర్కింగ్ స్పేస్‌లను ఏర్పాటు చేస్తున్నారు.
సమయం, సౌకర్యం.. సద్వినియోగం
అత్యాధునిక సదుపాయాలతో విమానాశ్రయాన్ని తలపించే స్థాయిలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను ఆధునీకరిస్తున్న విషయం తెలిసిందే. సుమారు రూ.750 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన పను లు ఇప్పటికే 60శాతానికి పైగా పూర్తయ్యాయి. ఈ క్రమంలో రైలు ప్రయాణాల్లో సదుపాయాలను అందించడమేకాకుండా.. ప్రయాణికులు విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే డిజిటల్ లాంజ్‌లు, కో-వర్కింగ్ స్పేస్‌లను ఏర్పాటు చేసి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, వ్యాపార వేత్తలు, విద్యార్థులకు పని వాతావరణాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రైల్వే ఇప్పటికే ముంబై స్టేషన్‌లో ఈ తరహా సదుపాయాలు అందుబాటులోకి తెచ్చింది కూడా.
ఏమేం సదుపాయాలు ఉంటాయి?
డిజటల్ లాంజ్, కో-వర్కింగ్ స్పేస్‌లో అత్యాధునిక సదుపాయాలు ఉంటాయి. హైస్పీడ్ వైఫై, చార్జింగ్ పాయింట్లు, వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయాలు, ప్రింటింగ్/స్కానింగ్ సౌకర్యాలు, ఎయిర్-కండిషన్ వసతి కలిగిన సైలెంట్ వర్క్‌పాడ్‌లు ఉంటాయి. ఆఫీసు తరహాలో టేబుల్, సౌకర్యవంతమైన కుర్చీలు, టీ, కాఫీ సదుపాయాలు, ఆధునిక టాయిలెట్లు, వాష్‌రూములు ఉంటాయి. భోజనం లేదా అల్పాహారం వంటి సౌకర్యాలూ ఉంటాయి. రైలు కోసం వేచి ఉండే సమయంలో, రెండు రైళ్లు మారాల్సి వచ్చినప్పుడు ఉండే విరామం (గ్యాప్)లో ఈ సదుపాయాలను వినియోగించుకుని పని చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్‌ను పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో అమలు చేసే అవకాశం ఉందని.. ఈ ఏర్పాట్లతో రైల్వేకు అదనపు ఆదాయం కూడా సమకూరుతుందని రైల్వే అధికారులు చెప్పారు. ముంబై సెంట్రల్ రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన డిజిటల్ లాంజ్.. రోజూ ఉదయం 7 నుంచిరాత్రి 11 గంటల వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. అక్కడ మొదటి గంటకు రూ.200, తర్వాత ప్రతి అదనపు గంటకు రూ.150 చొప్పున చెల్లించి.. డిజిటల్ లాంజ్, కో-వర్కింగ్ స్పేస్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని వివరించారు. సికింద్రాబాద్ స్టేషన్‌లోనూ ఏర్పాట్లను బట్టి చార్జీలను నిర్ణయించే అవకాశం ఉందని తెలిపారు.