Child Injured in Dog Attack: కుక్కల దాడిలో చిన్నారికి గాయాలపై స్పందించిన బెల్లంపల్లి కోర్టు
ABN , Publish Date - Sep 08 , 2025 | 02:39 AM
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో ఈనెల 5న ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటనపై బెల్లంపల్లి కోర్టు...
ఎంపీడీవో, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శులపై కేసు
కాసిపేట, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో ఈనెల 5న ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటనపై బెల్లంపల్లి కోర్టు స్పందించింది. సంబంధిత అధికారులపై సుమోటోగా కేసు నమోదు చేసింది. కాసిపేట మండలం ముత్యంపల్లికి చెందిన అక్షిత చిన్నధర్మారంలోని ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. ఆమె తల్లి కాసిపేట మోడల్ స్కూల్‌లో స్వీపర్‌గా పని చేస్తోంది. శుక్రవారం పాఠశాలకు సెలవు కావడంతో తల్లితో పాటు చిన్నారి మోడల్ స్కూల్‌కు వెళ్లింది. పాఠశాల సమీపంలో ఆడుకుంటున్న అక్షితపై అక్కడున్న వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. దీనిపై పత్రికల్లో వార్త రావడంతో బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి స్పందించారు. కాసిపేట ఎంపీడీవో సత్యనారాయణసింగ్, ఎంపీవో షేక్ సప్దర్ ఆలీ, ముత్యంపల్లి పంచాయతీ కార్యదర్శి మేఘనపై సుమోటో కింద కేసు నమోదు చేశారు. వారికి త్వరలో నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది.