Share News

Warangal Highway Accident: వరంగల్‌ రహదారిపై కారు బీభత్సం

ABN , Publish Date - Nov 03 , 2025 | 03:51 AM

వరంగల్‌ జాతీయ రహదారిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో అదుపుతప్పి రోడ్డు పక్కన నిలబడి ఉన్న దంపతులపైకి దూసుకెళ్లడంతో వారు...

Warangal Highway Accident: వరంగల్‌ రహదారిపై కారు బీభత్సం

  • అదుపుతప్పి దంపతులపైకి దూసుకెళ్లిన వాహనం

  • అక్కడికక్కడే మృతి చెందిన దంపతులు

  • కారులో ఉన్న ముగ్గురు యువకులకు తీవ్రగాయాలు

  • యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ వద్ద ఘటన

బీబీనగర్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌ జాతీయ రహదారిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో అదుపుతప్పి రోడ్డు పక్కన నిలబడి ఉన్న దంపతులపైకి దూసుకెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో ఆదివారం ఈ ఘటన జరిగింది. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా బోడ్డుప్పల్‌లో నివాసం ఉంటున్న గర్దాసు ప్రశాంత్‌ (32), ప్రసూన దంపతులు ఆదివారం వరంగల్‌ జిల్లా పాలకుర్తిలో ఉన్న తమ బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. మార్గమధ్యలో బీబీనగర్‌ పెద్దచెరువు సమీపంలోకి రాగానే ప్రశాంత్‌కు ఫోన్‌ రావడంతో రోడ్డు పక్కన వాహనాన్ని ఆపి ఫోన్‌ మాట్లాడుతున్నాడు. అదే సమయంలో హైదరాబాద్‌ వైపు నుంచి అతివేగంగా వచ్చిన ఓ కారు అదుపు తప్పి దంపతులను ఢీకొట్టింది. ప్రశాంత్‌ రోడ్డుపై 20 అడుగుల దూరంలో ఎగిరిపడి మృతి చెందగా ప్రసూన పక్కనే ఉన్న చెరువు అలుగు ప్రదేశంలో పడి ప్రాణాలు విడిచింది. కారు చెట్టుకు ఢీకొని ఎడమ వైపున సర్వీస్‌ రోడ్డుపై పడింది. కారు నడుపుతున్న షణ్ముక్‌ తలకు తీవ్ర గాయాలు కాగా, అతని పరిస్థితి విషమంగా ఉంది. కారులో ఉన్న భార్గవ్‌, సాయిరిత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు యువకులను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి పంపించారు.

కారును అద్దెకు తీసుకుని యాదగిరిగుట్టకు..

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన తంగెళ్లపల్లి షణ్ముక్‌, చైతన్యపురికి చెందిన భార్గవ్‌, వరంగల్‌ పద్మానగర్‌కు చెందిన సాయిరిత్‌ హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడిని దర్శించుకునేందుకు ఎల్బీనగర్‌లో కారును అద్దెకు తీసుకుని బయలుదేరిన ముగ్గురు బీబీనగర్‌ వద్ద ప్రమాదానికి కారణమై తీవ్రంగా గాయపడ్డారు.

Updated Date - Nov 03 , 2025 | 03:51 AM