Bear Attack: ఎలుగుబంటి దాడిలో దంపతుల మృతి
ABN , Publish Date - Sep 27 , 2025 | 03:03 AM
ఎలుగుబంటి దాడి చేయడంతో పశువుల కాపర్లయిన దంపతులు మృతి చెందిన ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది....
సిర్పూర్(టి), సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఎలుగుబంటి దాడి చేయడంతో పశువుల కాపర్లయిన దంపతులు మృతి చెందిన ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది. సిర్పూర్ (టి) మండలం, అచ్చెల్లి గ్రామానికి చెందిన దూలం శేఖర్ (45), దూలం సుశీల (38) దంపతులు పశువులను మేపడానికి గురువారం పెద్దబండ అటవీ ప్రాంతానికి వెళ్లారు. సాయంత్రానికి పశువులు ఇంటికి చేరుకున్నా తమ తల్లిదండ్రులు రాకపోవడంతో ఆందోళనకు గురైన వారి పిల్లలు ఈ విషయాన్ని తమ బంధువులకు చెప్పారు. వారు శేఖర్‌కు పలుమార్లు ఫోను చేసినా ఎత్తకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. సీఐ సంతోష్, ఎస్సై సురేశ్ ఆధ్వర్యంలో అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టిన పోలీసులు రాత్రి 12 గంటల సమయంలో సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పడి ఉన్న మృతదేహాలను గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాలను సిర్పూర్(టి) ఆసుపత్రి మార్చురీకి తరలించారు. శుక్రవారం ఉదయం కాగజ్‌నగర్ డీఎస్పీ వహిదోద్దీన్, డీఎ్‌ఫవో సుశాంత్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఎలుగుబంటి దాడి చేసినట్లుగా ధ్రువీకరించారు. విషయాన్ని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు అటవీశాఖ మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్సీ దండె విఠల్ ప్రభుత్వపరంగా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని వారు హామీ ఇచ్చినట్లు తెలిపారు. మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు రూ.20 లక్షల పరిహారం అందజేస్తామని ఎఫ్‌డీవో సుశాంత్ భరోసా ఇచ్చారు.