Family tragedy: ప్రాణాలు తీసిన మధ్యవర్తిత్వం
ABN , Publish Date - Dec 22 , 2025 | 04:59 AM
మధ్యవర్తిగా ఉండి ఇతరులకు అప్పులు ఇప్పించిన ఓ వ్యక్తి, ఆ డబ్బులు తిరిగి రాకపోవడం.. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో మనస్తాపం చెంది భార్యతో కలిసి ఆత్మహత్యకు....
అప్పులు ఇచ్చినవారి వేధింపులకు దంపతుల బలి
హుస్నాబాద్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): మధ్యవర్తిగా ఉండి ఇతరులకు అప్పులు ఇప్పించిన ఓ వ్యక్తి, ఆ డబ్బులు తిరిగి రాకపోవడం.. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో మనస్తాపం చెంది భార్యతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష(32), రుక్మిణి(25) దంపతులు. వీరికి మూడేళ్ల కుమార్తె హరిప్రియ ఉంది. బెజ్జంకిలో అద్దెకు ఉంటూ బట్టల షాపు నిర్వహిస్తున్నారు. శ్రీహర్ష కొంతకాలంగా తెలిసినవారికి, స్నేహితులకు మధ్యవర్తిగా ఉండి రూ.13లక్షలు అప్పుగా ఇప్పించారు. అయితే, అప్పులు తీసుకున్న వారు సకాలంలో చెల్లించక ఇబ్బందులకు గురి చేశారు. అప్పులు ఇచ్చిన వారి నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో శ్రీహర్షకు దిక్కుతోచలేదు. దీంతో ఆదివారం తెల్లవారుజామున దంపతులు అద్దెకు ఉంటున్న ఇంట్లోనే పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. తల్లిదండ్రులకు ఏమైందో తెలియని స్థితిలో కుమార్తె హరిప్రియ గట్టిగా కేకలు వేసింది. ఇంట్లో నుంచి శబ్దాలు రావడంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారమందించారు. ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి రుక్మిణి అప్పటికే మృతి చెందగా, కొన ఊపిరితో ఉన్న శ్రీహర్షను సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలిస్తుండగా మృతి చెందారు. చిన్నారి హరిప్రియకు కూడా పురుగుల మందు తాగించారేమోననే అనుమానంతో ఆస్పత్రికి తరలించారు. అయితే, అలాంటిదేం లేదని, చిన్నారి క్షేమంగా ఉందని వైద్యులు తేల్చారు. ఘటనా స్థలాన్ని సిద్దిపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి పరిశీలించారు. శ్రీహర్ష రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. అప్పులిచ్చి వేధిస్తున్న ఐదుగురి పేర్లను లేఖలో పేర్కొన్నారు. పోస్టు మార్టం అనంతరం శ్రీహర్ష రుక్మిణి దంపతుల మృతదేహాలను స్వగ్రామమైన బెజ్జంకి మండలం దాచారం గ్రామానికి తీసుకు వచ్చి ఒకే చితిపై ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు.